భూమి,శ్రమ,చట్టాలు ఈ మూడింట్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. చివరి ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన నిర్మలా.. మూడు నెలల పాటు పేదలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు.
సంక్షోభం తలెత్తింది వాస్తవమేనని, అయితే, సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలన్నారు నిర్మలా. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. జన్‌ధన్‌కు సంబంధించి రూ.20 కోట్ల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. రైళ్లకు అయ్యే ఖర్చులు 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయని చెప్పారు.
అవసరార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశామని అన్నారు. భవన నిర్మాణాల రంగానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమచేశామని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఆహారధాన్యాలు, పప్పు దినుసులు అందిస్తున్నామని చెప్పారు.12 లక్షల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులు రూ.3,600 కోట్ల నగదు వెనక్కి తీసుకున్నారని చెప్పారు.