పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటిని తరలించడం చేతకాకపోతే ఆ బాధ్యతను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నీటి తరలింపుపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
కుడికిళ్ల సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డంకిగా ఉన్న తుండు కట్టను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, రెండు పంపుల సామర్థ్యానికి సరిపడే విధంగా కట్టను తొలగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు.
రిజర్వాయర్లకు నీటిని తరలించే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. నీటిని తరలించలేకపోతే నాలుక కోసుకుని మరోసారి నీళ్ల గురించి మాట్లాడబోనని సవాల్ విసిరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వెటకారపు వ్యాఖ్యలు మానుకుని, రైతులకు సాగునీరు ఎలా అందించాలనే అంశంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, రిజర్వాయర్లకు నీటిని తరలించే చర్యలు చేపట్టాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
Also Read:అమితాబ్..డిజిటల్ డిటాక్స్!

