బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ మరోసారి తమ ప్రేమతో అభిమానులను ఆకట్టుకున్నారు. కర్వా చౌత్ పండుగ సందర్భంగా భార్యతో కలిసి ఉండేందుకు నిక్ తన టూర్ షెడ్యూల్ను సైతం మార్చుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భర్తపై ప్రేమను చాటుకున్నారు.
అక్టోబర్ 29న ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీతో కలిసి కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ఇంట్లో జరిగిన వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ముఖ్యంగా భర్త కోసం ప్రత్యేకంగా వేసుకున్న మెహందీ డిజైన్తో పాటు పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ప్రియాంక ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను అడగకుండానే నిక్ ఇంటికి వచ్చారని, ఈ పండుగ తనకు, తమ కుమార్తెకు ఎంత ముఖ్యమో ఆయనకు తెలుసని పేర్కొన్నారు. కర్వా చౌత్ రోజున ఇంట్లో ఉండేలా తన టూర్ షెడ్యూల్ను ముందుగానే ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు. ‘నా వ్యక్తి లాంటి వారు మరొకరు లేరు. ఇలాంటి ప్రేమ అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను. హ్యాపీ కర్వా చౌత్’ అంటూ భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నిక్ జోనాస్ తన సోదరులు జో, కెవిన్లతో కలిసి జోనాస్ బ్రదర్స్ టూర్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ భార్య కోసం సమయాన్ని కేటాయించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 2022 జనవరిలో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి తల్లిదండ్రులయ్యారు.
Also Read:ఫోన్లు పక్కన పెట్టండి..కొత్త ట్రెండ్!

