ప్రజాసంఘాల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

144
nia
- Advertisement -

మావోయిస్టు కొరియర్ పంగి నాగన్న కేసు దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని విరసం, పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఏపీ,తెలంగాణలో పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రముఖ న్యాయవాది రఘునాధ్ నివాసం తో పాటు డప్పు రమేష్ నివాసం లో సోదాలు నిర్వహించారు. మావోయిస్టుల తో సంబంధాలు ఉన్న ఆరోపణలతో గతంలో ప్రొఫెసర్ కాశీమ్,నలమాస కృష్ణ,తో పాటు పలువురు ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేసిన వారిపై NIA కేసు నమోదుచేసింది.

ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబును ఎన్‌ఐఏ బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. తూర్పు గోదావరిజిల్లా రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో నిర్బంధించి విచారిస్తున్నట్లు తెలిసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ ఇంట్లో బుధవారం సాయంత్రం ఎన్‌ఐఏ పోలీసులు సోదాలు చేపట్టారు. తనిఖీల సమయంలో చంద్రశేఖర్‌ ఇంట్లో లేరు. చంద్రశేఖర్‌పై విశాఖ జిల్లా మంచింగ్‌పుట్ట పోలీసు స్టేషన్‌లో, పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో ఇటీవలే రెండు కేసులు నమోదు చేశారు. ఏపీ ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజేశ్వరి అలియాస్‌ రాజి ,విశాఖ నగరంలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని కేఎస్‌ చలం ఇళ్లలో వేర్వేరుగా సోదాలు నిర్వహించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన విరసం మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి నివాసంలో ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. దాదాపు నాలుగు గంటలకుపైగా అధికారులు వరలక్ష్మిని విచారించినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా ఆలకూరపాడు గ్రామంలో నివాసముంటున్న మావోయిస్టు అగ్రనేత హరగోపాల్‌(ఆర్కే) సహచరి పద్మ నివాసంలోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ విప్లవ రచయిత పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -