ఖండాంతరాల్లో తెలంగాణ ఖ్యాతి వెలిగిపోతోంది. బతుకమ్మ సంబురాలతో యావత్ తెలంగాణ పులకించి పోతుండగా.. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. న్యూజిలాండ్ లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆ దేశ ప్రధాని పాల్గొని సందడి చేశారు. ప్రపంచంలోనే ఓ దేశ ప్రధాని బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకమైన బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ వైభవంగా జరుపుకుంటున్నారు. న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారైలు ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారు. ఇక పూల పండుగ విశిష్టతతను తెలుసుకున్న ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని అందరిని ఉత్సాహపరిచారు.
తెలంగాణ పండుగను గౌరవిస్తూ బతుకమ్మ ఆడిన జెసిండాకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే బతుకమ్మ వేడుకల్లో ఓ దేశ ప్రధాని పాల్గొనడం ఇదే మొదటిసారి అని.. మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించి బతుకమ్మ ఆడిన ఆమెకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే న్యూజిలాండ్ లో అత్యధికంగా తెలుగువారు నివసిస్తున్నారని.. వారి ఆహ్వానాన్ని మన్నించి ప్రధానమంత్రి స్థాయిలో ఉండి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం హర్షనీయమన్నారు. బతుకమ్మ వేడుకలు నిర్వహించినందుకు న్యూజిలాండ్ తెలంగాణ అసొసియేషన్ కు కేటీఆర్ అభినందనలు చెప్పారు.