తెలంగాణ రాష్ట్ర హస్త కళలు, చేనేత, టూరిజం ప్రవాస భారతీయులకు పరిచయం చేసి, ప్రవాస భారతీయులను భాగస్వాములుగా చేసి తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించి, తద్వారా మన రాష్ట్ర నేతన్నలకు, హస్త కళాకారులకు ఉపాధి కల్పనకు కృషిచేస్తున్న బ్రాండ్ తెలంగాణ ద్వారా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరను ప్రస్తుత ప్రభుత్వ లేబర్ పార్టీ, న్యూ జీలాండ్ మొట్ట మొదటి దక్షిణ భారత ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ కొనుగోలు చేసి, బ్రాండ్ తెలంగాణ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రచారకర్తగా ముందుకు వచ్చారని తెలుపటానికి సంతోషంగా ఉందని బ్రాండ్ తెలంగాణ వ్యస్థాపకురాలు సునీతవిజయ్ తెలియజేశారు.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జిలాండ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు,ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పట్లోళ్ల, మరియు కమిటీ సభ్యులను అభినందించారు. ఆలాగే, మన రాష్ట్ర ప్రభుత్వం ఉభయతారకంగా చేపట్టిన బతుకమ్మ చీర కానుక పథకాన్ని కొనియాడారు. న్యూ జీలాండ్‌లో బ్రాండ్ తెలంగాణ చేస్తున్న చేపట్టిన ఉద్దేశ్యం చాల గొప్పగా ఉందన్నారు. ఈ వేడుకకు సిరిసిల్ల చీర ధరించి వచ్చానని చెప్పారు. అందరికి తెలుగులో శుభాకాంక్షలు తెలియజేశారు.