అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం మరో 100 రోజుల్లో ముగియనుంది. అమెరికాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈ తరుణంలో కొత్త అధ్యక్షుడు 100 రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలువాల్సిన అవసరముందని అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ స్పష్టంచేసింది. భారత్-అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఆవశ్యకతను చాటడానికి ఈ భేటీ అవసరమని అభిప్రాయపడింది.
కొత్తగా ఎన్నికై శ్వేతసౌధంలోకి వెళ్లేదెవరైనా భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ ‘ఇండో-అమెరికాలు భద్రతపై పరస్పర సహకారం’ అంశంపై ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. మౌలికమైన ఒప్పందాలపై భారత్‌తో సంతకాలు చేయించే పూచీ అమెరికా కొత్త పరిపాలక బృందంపై ఉంటుందని, దీనివల్ల భారత-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం అవుతుందని ఈ నివేదికలో పేర్కొంది. ఈ ఒప్పందాలు చేసుకోలేకపోతే.. భారత్ రక్షణ సామర్థ్యానికి అవసరమైన అడ్వాన్స్‌డ్ సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ సాంకేతికతలను ఆ దేశానికి అమెరికా దాదాపు అందించలేదు’ అని పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లతో కలిసి పనిచేయాలని, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అందరికీ ఆసక్తికర అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించింది.
భారత్‌తో చక్కని ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని.. ఉగ్రవాద నిర్మూలన కోసం తాలిబన్లతో జరిపే చర్చలకు అమెరికా కొత్త ప్రెసిడెంట్ భారత్‌ను ఆహ్వానించాలని సర్వే సంస్థ సూచించింది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. రాబోయే కొత్త అధ్యక్షలెవరైనా కానీ.. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని ఈ సర్వే స్ఫష్టం చేసింది. నవంబరు 8న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ పోటీ చేస్తున్నారు.