కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తను వేగవంతం చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో నిందితులను కృష్ణాజిల్లా నందిగామ సబ్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే న్యాయవాదుల సమక్షంలో జాయరాం భార్య పద్మ శ్రీ స్టేట్‌మెంట్‌ని రాకర్డు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లి వివరాలు నమోదుచేసుకున్నారు.
అయితే అక్కడ జూబ్లీహిల్స్ పోలీసులకు పొంతనలేని సమాధానాలు దొరికాయి. రాకేష్ ఫ్లాట్‌ని నిశీతంగా పరిశీలించి చుట్టుపక్కల వారిని ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్‌రెడ్డి, వాచ్‌మెన్ శ్రీనివాస్‌ల అప్పగింతకు సంబంధించిన పీటీ వారెంట్‌తో జూబ్లీహిల్స్ పోలీసులు నందిగామ వెళ్లినా కోర్టు సెలవుకావడంతో ఇవాళ వారిని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఈ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర కీలకమని జయరాం సతీమణి పద్మశ్రీ చెబుతుండగా తాజాగా మరోపేరు తెరమీదకు వచ్చింది. జయరాంను తన ట్రాప్‌లో పడేసేందుకు రాకేష్ రెడ్డి అమ్మాయి పేరుతో చాటింగ్ చేశాడు. ఆ పేరు వీణ. ఈ పేరునే జయరాంతో చాటింగ్ చేసేందుకు ఎందుకు ఎంచుకున్నాడనే కోణంలోను దర్యాఫ్తు చేయనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఈ హత్యకు డబ్బులే కారణమా, మరేదైనా కారణం ఉందా, తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలోను విచారించనున్నారు.
జనవరి 31 వ తేదీన మధ్యాహ్నం 3:50 నిమిషాలకు రాకేష్ రెడ్డి కారును కేబీఆర్ పార్కు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. ఈ సీసీటీవీ ఫుటేజీయే దర్యాప్తులో కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా త్వరలోనే జయరాం హత్యకు గల కారణాలను ఆధారాలతో సహా బయటపెట్టనున్నారు పోలీసులు.