సింగరేణిలో కొత్త క్వార్టర్ల నిర్మాణం: శ్రీధర్

482
singareni
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు సింగరేణి కార్మికులకు గతంలో ఇచ్చిన హామీ అమలులో భాగంగా 210 కోట్ల రూపాయలతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపింది. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో సోమవారం (జూలై 20వ తేదీ) నాడు తన అధ్యక్షతన జరిగిన 554వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నామని సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు సింగరేణి ప్రాంతాల్లో కొత్త క్వార్టర్లు నిర్మించి కార్మికులకు అందుబాటులోకి తేవాలని గతంలో శ్రీరాంపూర్‌ ఏరియా ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లి ప్రాంతంలో ఇప్పటికే తొలిదశ క్వార్టర్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు భూపాలపల్లి ఏరియాలో విశాలమైన సౌకర్యవంతమైన 994 ఎం.డి. టైపు క్వార్టర్లు నిర్మించడానికి నిర్ణయించామనీ, దీనికి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.

అలాగే పర్యావరణ పరిరక్షణ చర్యలను మరింత పటిష్టంగా అమలు జరపడానికి, పర్యావరణ పరమైన అనుమతులు,తదితర అంశాలను పర్యవేక్షించడానికీ సంబంధిత నిపుణులతో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడానికి బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. త్వరలోనే ప్రస్తుత విభాగం స్థానంలో పూర్తి స్థాయి పర్యావరణ శాఖ సింగరేణిలో ఏర్పాటవుతుందని తెలిపారు.

సింగరేణి సంస్థ 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంటుల నిర్మాణానికి పూనుకొని మొదటి, రెండవ దశకు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించడం, మొదటి దశలో జైపూర్‌ లోని 10 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించడమే కాక, త్వరలోనే మణుగూరు, ఇల్లందు ప్లాంటులను ప్రారంభించబోవడంపై బోర్డు హర్షం ప్రకటించింది. 3వ దశ పనులకు కూడా కంపెనీ అతి త్వరలో టెండర్లు ఖరారు చేయనుంది.

ఇల్లందు ఏరియా కోయగూడెం ఓ.సి.-2లో సర్ఫేసు మైనర్‌ ద్వారా 74 లక్షల క్యూబిక్‌ మీటర్ల బొగ్గు తవ్వకానికి, మణుగూరు పి.కె. ఓ.సి. నుండి రానున్న 6 ఏళ్లలో 1,416 లక్షల బ్యాంక్‌ క్యూబిక్‌ మీటర్ల ఓ.బి. తవ్వకానికి బోర్డు ఆమోదం తెలిపింది. సింగరేణిలో గల ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో ఓ.బి. తవ్వకం కోసం వినియోగించే మందుగుండు సామగ్రి కొనుగోలుకు రూ॥ 106 కోట్లు, భూగర్భ గనుల్లో వాడే మందుగుండు సామగ్రి కొనుగోలుకు రూ॥ 41 కోట్లను కేటాయిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది.

ఇంతేకాక మరికొన్ని అంశాలపై కూడా బోర్డు చర్చించి ఆమోదాలు తెలిపింది. సింగరేణి ఎడ్యుకేషనల్‌ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిటెక్నికల్‌ కళాశాల, మహిళా, జూనియర్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యూయేట్‌ కళాశాలలు, 9 సింగరేణి హైస్కూల్స్‌ నిర్వాహణకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 45 కోట్ల రూపాయల బడ్జెటును బోర్డు మంజూరు చేసింది.

సంస్థ ఛైర్మన్‌ & ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ బోర్డు సమావేశంలో బోర్డు సభ్యులైన వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ సి&ఎం.డి. శ్రీ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నాగపూర్‌ నుండి, కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ సెక్రటరీలు శ్రీ పి.ఎస్‌.ఎల్‌. స్వామి, శ్రీ అజితేష్‌ కుమార్‌ లు న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. కాగా సమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, సింగరేణి నుండి డైరెక్టర్‌ (ఇ&ఎం) శ్రీ ఎస్‌.శంకర్‌, డైరెక్టర్‌ (ఆపరేషప్స్‌ & పా) శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (పి&పి) శ్రీ బి.భాస్కరరావు, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) శ్రీ ఎన్‌.బలరాం ఇంకా జనరల్‌ మేనేజర్‌ (కో-ఆర్డినేషన్‌) శ్రీ కె.రవిశంకర్‌, కంపెనీ కార్యదర్శి శ్రీ గుండా శ్రీనివాస్‌ లు పాల్గొన్నారు.

- Advertisement -