తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఈసమావేశంలో రెండు పథకాలను మంత్రి వర్గం ఆమోదించింది. మొత్తం 15అంశాలతో మంత్రివర్గ సమావేశాన్ని రూపోందించారు. కొ్త్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకంను మంత్రివర్గం ఆమోదించింది. రైతు సమన్వయ సమితి పోస్టుల మంజూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంపనకు మంత్రి వర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అలాగే దేవాదుల ప్రాజెక్టు, తుపాకుల గూడెం ఆనకట్ట నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా పలు విషయాలపై చర్చించారు సీఎం కేసీఆర్. కొత్త పథకాల అమలు తీరుపై మంత్రులను ఆరా తీశారు సీఎం కేసీఆర్. రైతుసమన్వయ సమితికి ఎండీతో పాటు పలువురు సభ్యులను నియమించనున్నట్లు మంత్రివర్గ భేటిలో చర్చించారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ద్వారా సీఎం కేసీఆర్ ఢిల్లికి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు ఢిల్లిలోనే బస చేయనున్నట్లు సమాచారం. . కొత్త జోనల్ విధానంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఓ నివేదిక సమర్పించనున్నారు.