రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం..కమిటీ ఏర్పాటు

606
rajiv swgruha
- Advertisement -

రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కాగా కమిటీలో సభ్యులుగా ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్ ఉన్నారు.

బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకం కోసం విధివిధానాలు ఖరారు చేయనుంది కమిటీ. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటు చేయగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది గృహనిర్మాణ శాఖ.

2007లో రూ.6,400 కోట్లతో రాజీవ్‌స్వగృహ ప్రారంభమైంది. 36 ప్రాజెక్టుల్లో 20 తెలంగాణలో, 16 ఏపీలో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడే చాలామంది రూ.5 వేలు చొప్పున చెల్లించి ఫ్లాట్లను బుక్‌చేసుకున్నారు. ఈ ఇండ్ల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేయగా.. అడ్వాన్స్‌ బుకింగ్‌ రూపంలో కొనుగోలుదారుల నుంచి రూ.370 కోట్లు రాబట్టారు. ఈ నిధులతో 2011 వరకు కొంత పని పూర్తిచేశారు. ఆ తర్వాత బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి.

2013లో పేదల ఆశలకు గండికొడుతూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీవో 11ను విడుదల చేశారు. రాజీవ్‌ స్వగృహ ఇండ్లను నిర్మించలేమని, అడ్వాన్స్‌ చెల్లించినవారికి డబ్బు వాపసు ఇవ్వాలని ఆ జీవోలో పేర్కొనడంతో పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇండ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. తెలంగాణలోని 14 ప్రాజెక్టుల్లో నిర్మాణాలు చేపట్టి దాదాపు 3,716 ఫ్లాట్ల నిర్మాణాలను 96 శాతం మేరకు పూర్తిచేసింది. మరో 5,280 ఫ్లాట్లు 639 ఇండిపెండెంట్‌ ఇండ్లు సెమీ ఫినిషింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు అన్ని ప్రాంతాల్లో ఓపెన్‌ ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -