4 కోట్ల డౌన్‌లోడ్‌లు దాటిన ‘ఆధార్ యాప్’!

3
- Advertisement -

జనవరి 2026లో ప్రారంభమైన కొత్త ఆధార్ యాప్ (Aadhaar App) ఇప్పటివరకు 4 కోట్ల డౌన్‌లోడ్‌లను పూర్తి చేసుకుంది. డిజిటల్ పద్ధతిలో మొబైల్ నంబర్, చిరునామా, ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోవడంతో పాటు బయోమెట్రిక్ ప్రామాణీకరణను నిర్వహించడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 2026లో ప్రారంభించిన ఈ కొత్త ఆధార్ యాప్ అతి తక్కువ సమయంలోనే 4 కోట్ల డౌన్‌లోడ్‌ల మైలురాయిని దాటింది. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు సుమారు 49 లక్షల మొబైల్ నంబర్లు,11.65 లక్షల చిరునామాలు,12.5 లక్షల ఈమెయిల్ ఐడీలు అప్‌డేట్ అయ్యాయి.

అంతేకాకుండా బయోమెట్రిక్ లాక్ మరియు అన్‌లాక్ సదుపాయాన్ని వినియోగదారులు 1.91 కోట్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారు. గతంలో ఉన్న ‘mAadhaar’ యాప్ స్థానంలో ఈ కొత్త యాప్‌ను జనవరి 28, 2026న ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ (Android) మరియు ఐఓఎస్ (iOS) వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచే అనేక ఆధార్ సేవలను సులభంగా పొందవచ్చు.

ఆధార్ యాప్‌లో అందుబాటులో ఉన్న సేవలు

అనేక ఆధార్ సంబంధిత పనులను ఈ యాప్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు:

ఫేస్ ఆథెంటికేషన్: ముఖాన్ని గుర్తించడం ద్వారా ఆధార్ ప్రామాణీకరణ చేయడం.

ఈ-ఆధార్ డౌన్‌లోడ్: డిజిటల్ ఈ-ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవడం.

బయోమెట్రిక్ కంట్రోల్స్: అవసరం లేనప్పుడు బయోమెట్రిక్‌ను లాక్ చేయడం, అవసరమైనప్పుడు అన్‌లాక్ చేసుకోవడం.

క్యూఆర్ కోడ్ కాంటాక్ట్ కార్డ్: ఎంపిక చేసిన వివరాలను మాత్రమే పంచుకోవడానికి QR-ఆధారిత కాంటాక్ట్ కార్డ్‌ను రూపొందించుకోవచ్చు.

మల్టీ-ప్రొఫైల్ సపోర్ట్: ఒకే మొబైల్ డివైజ్‌లో గరిష్టంగా 5 ఆధార్ ప్రొఫైల్‌లను జోడించుకోవచ్చు.

ALso Read:ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదు:ట్రంప్

మీ పాత/ప్రస్తుత మొబైల్ నంబర్ ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమై ఉండి…ఆ నంబర్ పనిచేస్తుంటే (OTP అందుతుంటే) మాత్రమే యాప్ ద్వారా కొత్త మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పనిచేయకపోతే లేదా అసలు మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోకపోతే.. వారు నేరుగా ఆధార్ సేవా కేంద్రం లేదా అధికారిక ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు తమ చిరునామాను సులభంగా మార్చుకోవచ్చు. దీనికోసం ‘కుటుంబ పెద్ద’ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు.

యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకునే సదుపాయం జూలై 1, 2026 నుండి అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా చేసే ఈమెయిల్ అప్‌డేట్‌లకు సాధారణంగా ఉండే ₹75 రుసుమును డిసెంబర్ 31, 2026 వరకు మినహాయించారు (ఉచితం).

- Advertisement -