వేపాకు వల్ల నష్టాలు కూడా ఉన్నాయా?

56
- Advertisement -

వేపాకును సర్వరోగ నివారిణిగా పరిగణిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు. ఎన్నో వ్యాధులకు వేపను దివ్య ఔషధంలా ఉపయోగిస్తుంటారు. వేపలో యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వివిధ ఔషధాల తయారీలో వాడతారు. ముఖ్యంగా చర్మంపై పుండ్లు, గజ్జి, తామరా వంటి సమస్యలను దూరం చేయడంలోనూ వేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా నోటిపూత, నోటి దుర్వాసన వంటి వాటిని కూడా వేపాకు దూరం చేస్తుంది. ఇంకా జీర్ణ శక్తి మెరుగుపడుతుందని, మలబద్ధకం, వంటి సమస్యలు దూరమౌతాయని కొంతమంది వేప రసాన్ని తాగుతుంటారు.

ఇది కొంతవరకు వాస్తవమే అయినప్పటికి వేప రసాన్ని గాని లేదా వేపాకులను గాని అధికంగా సేవించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులను ఎక్కువగా నమలడం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుముఖం పట్టి లోబీపీకి కారణమౌతుందట. తద్వారా మైకం కమ్మడం, తల తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇంకా వేప రసాన్ని ఎక్కువగా తాగితే అలెర్జీకి దారి తీస్తుందట. తద్వారా వాంతులు, విరేచనాలు కూడా సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వేపాకులో అధికంగా ఉండే యాంటీ బయోటిక్ గుణాల కారణంగా వేప రసాన్ని ఎక్కువగా సేవిస్తే రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడుతుందట. ఇవి మాత్రమే కాకుండా గుండెల్లో మంట, వికారం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వేపాకులను గాని వేప రసాన్ని గాని మితంగానే తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:Bhumana:హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం

- Advertisement -