మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (VB-G RAM G) పథకం అమలులోకి వచ్చిన తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో గణనీయమైన తగ్గుదల నమోదైంది.
అధికారిక గణాంకాల ప్రకారం జులై 2026లో ఈ నూతన పథకం కింద కేవలం 7.67 కోట్ల పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది జులై నెలలో పాత ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద నమోదైన 15.33 కోట్ల పనిదినాలతో పోలిస్తే ఇది దాదాపు 49.94 శాతం (సగానికి పైగా) తగ్గుదల.
అలాగే లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. గతేడాది జులైలో 1.42 కోట్ల కుటుంబాలు పని పొందగా ఈ ఏడాది జులై నాటికి ఆ సంఖ్య 51.45 శాతం తగ్గి 68.94 లక్షలకు చేరింది. గడిచిన ఐదేళ్ల గణాంకాలతో పోలిస్తే ఇది అత్యల్ప నమోదు.
కొత్త VB-G RAM G చట్టం ప్రకారం ఏడాదికి ఉపాధి పనిదినాల హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినప్పటికీ, విత్తనాలు నాటే మరియు కోతల సీజన్‌లో (ఖరీఫ్ సీజన్) వ్యవసాయ పనులకు కూలీల కొరత రాకుండా ఉండటానికి ఏడాదికి గరిష్టంగా 60 రోజుల పాటు పథకానికి విరామం ప్రకటించే నిబంధన ఉంది. ఈ కారణం చేత కూడా పనిదినాలు తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీయే ప్రధాన ఆధారంగా మారింది. ఇలాంటి సమయంలో గ్రామీణ ఉపాధి పడిపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ…జులై 1 నుండి నూతన చట్టం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలులోకి వచ్చిందని తెలిపింది. డిజిటల్ సిస్టమ్ ద్వారా సాంకేతిక మార్పులు వేగంగా జరిగాయని తమ లెక్కల ప్రకారం తొలి నెలలో దాదాపు 9 కోట్ల పనిదినాలు కల్పించబడ్డాయని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకు నమోదైన మొత్తం పనిదినాల్లో 63 శాతం వాటా మహిళలకే దక్కిందని తెలిపింది.
ALso Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

