Modi:ఎన్డీయే కూటమి సమావేశం

4
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కూటమి భాగస్వామ్య పార్టీల కీలక సమావేశం జరగనుంది. కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి N. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ నిరంతరాయంగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీయే నేతలు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయనున్నారు. దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం ఎన్నికైన ప్రధానమంత్రుల్లో ఒకరిగా మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో ఆయనకు కూటమి తరఫున ఘన సన్మానం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే “వికసిత్ భారత్-2047” లక్ష్య సాధనకు సంబంధించిన కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రభావంపై సమీక్ష జరగనుంది.

దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేసే అంశంపై ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై కూడా అనధికారిక చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం ద్వారా ఎన్డీయే కూటమి భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు స్పష్టమైన మార్గదర్శకం లభించే అవకాశముంది.

భారత మండపంలో ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పాటు మీడియా ప్రతినిధులు, సంపాదకులు, జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విదేశాంగ విజయాలు, “వికసిత్ భారత్-2047” లక్ష్యాలపై మీడియాతో విస్తృతంగా చర్చించారు.

Also Read:హెచ్-1బి వీసా దారులకు గుడ్‌న్యూస్

జూన్ 9న సాయంత్రం భారత మండపంలోని సమ్మిట్ హాల్‌లో కేంద్ర మంత్రులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను మీడియా ముందు వివరించనున్నారు. ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.

కేంద్రంలో మోదీ 3.0 నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎన్డీయే వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వ పనితీరు, ప్రాంతీయ సమతుల్యత, కూటమి భాగస్వామ్య పార్టీలకు ప్రాతినిధ్యం, రాబోయే రాష్ట్ర ఎన్నికల రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని శాఖల్లో మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖాళీగా ఉన్న లేదా అదనపు బాధ్యతలతో కొనసాగుతున్న శాఖలకు పూర్తి స్థాయి మంత్రులను నియమించడం, పనితీరు ఆధారంగా కొందరు మంత్రుల శాఖలను మార్చడం, అలాగే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మరింత ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాలు పరిశీలనలోన్నాయి

- Advertisement -