NCERT విడుదల చేసిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై ఉన్న అధ్యాయంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో సంస్థ క్షమాపణలు తెలిపింది. ఈ అంశంపై ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్ మరియు సభ్యులు “నిస్సందేహమైన, నిరుపాధిక క్షమాపణలు” తెలుపుతున్నామని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఆ వివాదాస్పద అధ్యాయం ఉన్న మొత్తం పుస్తకాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
ఎక్స్ (X) వేదికలో చేసిన ప్రకటనలో ఎన్‌సీఈఆర్టీ, “చాప్టర్ IV వల్ల కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ఈ పుస్తకాన్ని పూర్తిగా వెనక్కి తీసుకున్నాం. ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు” అని పేర్కొంది. విద్యా కంటెంట్ విషయంలో ఖచ్చితత్వం, బాధ్యత, సున్నితత్వం వంటి అంశాలను ఎప్పటికీ పాటిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
ఇక ముందుగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌సీఈఆర్టీ ఒక అడ్వైజరీ జారీ చేసింది. Exploring Society: India and Beyond అనే 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై ఉన్న అధ్యాయం కారణంగా వివాదం తలెత్తడంతో, ఎవరి వద్ద ఉన్నా ఆ పుస్తక ప్రతులను ఎన్‌సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి తిరిగి ఇవ్వాలని కోరింది. అలాగే ఆ అధ్యాయానికి సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ వేదికల్లో ఉంటే వెంటనే తొలగించాలని సూచించింది.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి
వివాదానికి కారణమైన అధ్యాయంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలుగా అవినీతి, కేసుల పెండింగ్ భారీగా ఉండటం, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ కంటెంట్‌పై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్‌సీఈఆర్టీ క్షమాపణలు తెలుపుతూ, పుస్తకాన్ని తగిన అధికారులతో సంప్రదించి తిరిగి సవరించి విడుదల చేస్తామని తెలిపింది.

