నయనతార సినిమా సినిమాకు డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ఆడియెన్స్ కు కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ హీరోయిన్ తాజాగా ‘కోలమావు కోకిల’ అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తమిళనాట ఎక్కువ థియేటర్స్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత నయన్ మరో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాట్లు తెలుస్తుంది.
ఇక ఈ మద్య కాలంలో ఏ చిత్ర పరిశ్రమలో చూపినా బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. కొన్ని బయోపిక్‌లు ఆల్రెడీ విడుదలై మంచి సక్సెస్‌లు సొంతం చేసుకోగా, మరికొన్ని సెట్స్‌పై వున్నాయి. ఇక కోలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు పెరగనున్నట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి అక్కడ మూడు ప్రాజెక్టులు లైన్లోకి వచ్చాయి. ఎవరికివారు సాధ్యమైనంత త్వరగా తమ సినిమాను పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్‌ను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు.. జయాలు .. అపజయాలు వున్నాయి. వాటన్నింటినీ కలుపుతూ దర్శకుడు లింగుస్వామి కథ సిద్ధం చేసుకుంటున్నాడట. జయలలిత పాత్ర కోసం ఆయన నయనతారను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇంతటి బరువైన .. గంభీరమైన పాత్రను ఆమె మాత్రమే చేయగలదని భావించి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సినీ వర్గాల సమాచారం.