ఖైదీ 150తో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, కథానాయికగానే అనుకున్నారు. కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందనీ, నరసింహా రెడ్డిని ఢీ కొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం.
విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు. మరి ఆ పాత్రల కోసం ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, అక్టోబర్ చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.