నేడు జాతీయ రైతు దినోత్సవం…

34
farmers

ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత ఆనందంగా ఆస్వాదించాల్సిన రైతు దినోత్సవం నాడు కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక,వ్యవసాయ వ్యతిరేక నల్లచట్టాల మూలంగా ఈ రోజు రోడ్డు మీద నిలబడి రైతాంగం నిరసన తెలుపాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ పరిసరాలలో పంజాబ్, హర్యాన, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు రైతులు 28 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా నల్లచట్టాలను ఉపసంహరించుకుని రైతుల డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేయటానికి ముందుకు రాకపోవడం విచారకరం.

ఆందోళనల మూలంగా ఇప్పటి వరకు 41 మంది రైతులు చనిపోయారు. అందులో ఒకరు వ్యవసాయ చట్టాలను ఆత్మహత్య చేసుకోగా, నలుగురు ఆందోళనలకు వస్తూ ప్రమాదంలో మరణించారు.11 మంది చలి, గుండెపోటు, ఇతర కారణాలతో ఆందోళనా శిబిరాలలోనే మరణించడం అవమానకరం. వందలమంది రైతులు కేంద్ర ప్రభుత్వ దమనకాండలో గాయపడ్డారు.

దేశంలోని 50 రైతుసంఘాలు, 14 మిలియన్ల ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు మద్దతుగా పోరాడుతున్నారు. రైతులు ఇచ్చిన భారత్ బంద్ కు మద్దతుగా దేశంలోని 25 కోట్ల మంది ప్రజలు, రైతులు రోడ్ల మీదకు వచ్చి మద్దతు పలికారు.ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం దేశానికి మంచిది కాదు. 55 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరసమాజంపై ఉంది.

రైతులు డిమాండ్ చేసిన విధంగా వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలి. పంటలకు మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలి. మద్దతుధరకు పంటల కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలి. స్వామినాధన్ కమిటీ సిఫార్సులు అమలుచేయడం వంటి 10 డిమాండ్లను కేంద్రం భేషరతుగా అంగీకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.