చరిత్ర సృష్టించిన నాథన్ లైయన్

7
- Advertisement -

అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న మూడో అషెస్ టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్ చరిత్ర సృష్టించాడు. రెండో రోజు ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టిన లయన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ల జాబితాలో లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అధిగమించాడు.

ఈ టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌కు అత్యంత చెడ్డ ఆరంభం ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 371 పరుగులు ఇచ్చిన ఇంగ్లాండ్, బ్యాటింగ్‌కు దిగిన వెంటనే 22 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ పతనానికి ప్రధాన కారణంగా నాథన్ లయన్ నిలిచాడు. ఒకే ఓవర్‌లో ఒల్లి పోప్, బెన్ డకెట్‌లను ఔట్ చేసి, ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తిగా అశక్తం చేశాడు.

ఈ రెండు వికెట్లతో లయన్ టెస్టుల్లో తన వికెట్ల సంఖ్యను 564కు చేర్చాడు. దీంతో 124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లు తీసిన గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును ఆయన దాటాడు.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో ఉస్మాన్ ఖవాజా 126 బంతుల్లో 82 పరుగులు చేయగా, అలెక్స్ కేరీ 143 బంతుల్లో 106 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ స్టార్క్ కూడా 75 బంతుల్లో 54 పరుగులు చేసి కీలకంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేసింది.

Also Read:దావోస్‌కు రేవంత్..కోర్టు పర్మిషన్

ఇంగ్లాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ ఐదు వికెట్లతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ చెరో రెండు వికెట్లు తీయగా, జోష్ టంగ్ ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో జాక్ క్రాలీ 9 పరుగులకే ఔట్ కాగా, బెన్ డకెట్ 29 పరుగులు చేశాడు. 23 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు 85/4గా ఉండగా, మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పూర్తి పట్టు సాధించింది.

- Advertisement -