మంత్రి కేటీఆర్‌ను కలిసిన నాస్కామ్ అధ్యక్షురాలు..

572
ktr
- Advertisement -

టెక్నాలజీ మరియు ఐటి రంగంలో మార్పుల్లో ఎప్పటికప్పుడు భాగమవుతూ, అవకాశాలను అందుకుంటూ, అగ్రభాగాన ఉన్న తెలంగాణ మరోసారి తనదైన ప్రత్యేకత చాటుకొనున్నది. ఈ మేరకు వచ్చే సంవత్సరం 2020ని కృత్రిమ మేధో (అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సంవత్సరంగా పాటించనున్నది. ఇందులో భాగంగా కృత్రిమ మేధని వివిధ రంగాల్లో ఉపయోగించుకునేందుకు, టెక్నాలజీ కంపెనీలతో కలిసి పని చేయనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

ముఖ్యంగా వ్యవసాయ రంగం, పట్టణ రవాణా, వైద్య ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ద్వారా అనేక రకాలైన ప్రయోజనాలున్నాయని, ఈ మేరకు తెలంగాణలో కృత్రిమ మేధ ద్వారా ఆయా రంగాల్లో మరిన్ని సేవలు అందించేందుకు ఉన్న అవకాశాలను రానున్న సంవత్సరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయా రంగాల్లో మరిన్ని సేవలను అదనంగా వేగంగా అందించేందుకు వీలుకలుగుతుందని, ఈ మేరకు అయా రంగాల్లోని సవాళ్లను, సమస్యలను టెక్నాలజీ కంపెనీల సహకారంతో అధికమంచేందుకున్న అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు.

ఈరోజు నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోష్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కృత్రిమ మేధ సంవత్సరంగా పాటిస్తే నాస్కామ్ పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆమె మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నదని, అయా కంపెనీలు తమ ఆర్ అండ్ డి మరియు టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లను ఇక్కడ ప్రారంభిస్తున్నాయన్నారు.

వీటితోపాటు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి), కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లర్నింగ్ (యంఎల్), సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి రంగాల్లో వివిధ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఆయా రంగాల్లో శిక్షణ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధ వినియోగించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావడం పట్ల నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోష్ హర్షం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ రంగంలో ఇక్కడ అనుకూల ఈకోసిస్టమ్ తయారు చేసేందుకు, ఈ రంగంలోని కంపెనీలతో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

దీంతోపాటు డాటా సైన్స్ రంగంలో తెలంగాణ రాష్ట్రంతో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం నాస్కామ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, డైరెక్టర్ డిజిటల్ మీడియా దిలీప్ కొణతం ఉన్నారు.

- Advertisement -