నాసిక్ TCS కేసు..నిదా ఖాన్ అరెస్టు!

3
- Advertisement -

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం కేంద్రంగా సాగుతున్నట్లు చెప్తున్న ‘మత మార్పిడి’ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ను పోలీసులు ఛత్రపతి శంభాజీనగర్‌లో అరెస్ట్ చేశారు.

నాసిక్‌లోని టీసీఎస్ క్యాంపస్‌లో పనిచేసే పలువురు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిదా ఖాన్ మరియు ఆమె ముఠా మత మార్పిడి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఉద్యోగులలో మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు ఉన్నవారిని గుర్తించి, వారికి మతం ద్వారా ప్రశాంతత లభిస్తుందని నమ్మబలికే వారని బాధితులు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు నాసిక్ పోలీసులు నిదా ఖాన్‌తో పాటు మరికొందరిపై ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కేసు నమోదైనప్పటి నుండి నిదా ఖాన్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఆమె ఛత్రపతి శంభాజీనగర్లో తలదాచుకున్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం, మెరుపు దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుంది.

Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!

ఆమెను నాసిక్‌కు తరలించి, లోతైన విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.ఈ ముఠా వెనుక ఏవైనా అంతర్జాతీయ శక్తులు లేదా సంస్థల హస్తం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.ఈ ఉదంతంపై గతంలోనే స్పందించిన టీసీఎస్ యాజమాన్యం.. కార్యాలయ ప్రాంగణంలో ఇలాంటి అనైతిక చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది. అలాగే, ప్రాథమిక విచారణ అనంతరం నిందితురాలిని విధుల నుండి తొలగించినట్లు సమాచారం.

- Advertisement -