తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్,మంత్రి హరీష్,మహాకూటమిలోని కీలక నేతలు ఇవాళ నామినేషన్ దాఖలుచేయనున్నారు. ఇక మహాకూటమి తరపున కూకట్‌పల్లి సీటు టీడీపీకి కేటాయించడంతో ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముందుగా ఈ సీటు నుంచి సీనియర్ నేత పెద్దిరెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా తాజాగా మరోపేరు తెరమీదకు వచ్చింది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దింపాలన్న ఉద్దేశంతోనే ఆమెను అనుకుంటున్నట్టు టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. నిజానికి హరికృష్ణ కుమారుడైన కల్యాణ్‌రామ్, సుహాసినిలలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని భావించామని అయితే కల్యాణ్ రామ్ ఆసక్తి కనబర్చలేదని చెప్పారు.
సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్య. ఏపీ సీఎం చంద్రబాబు సైతం సుహాసిని పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించగా, తమకు కేటాయించిన 14 స్థానాలకుగానూ టీడీపీ 9 మందిని ఖరారు చేసింది.