రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి..

203
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఆర్‌ కుమారుడు, నటుడు నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Nandamuri Harikrishna

‘ఏపీ 28 బీడబ్ల్యూ 2323’ నంబరుగల కారులో మరో ముగ్గురితో కలసి హరికృష్ణ ప్రయాణిస్తున్న వేళ, ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మృతి వార్త విని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీడీపీ అభిమానులు కామినేని ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకుంటుండటంతో పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, బందోబస్తును పెంచారు.

ఇక గంటకు 160 కిలోమీటర్ల వేగంతో స్వయంగా కారును నడుపుతూ ఉండటం నందమూరి హరికృష్ణ మరణానికి కారణమైనట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు పల్టీలు కొట్టగా, హరికృష్ణ ఛాతీ స్టీరింగ్ కు బలంగా తగిలిందని, ఆపై ఆయన కారులోంచి కిందపడగా, బలమైన గాయమై మెదడు చిట్లిందని కామినేని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి.

Nandamuri Harikrishna

ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని, అత్యవసర వైద్య చికిత్సలు చేసినా ఆయన ప్రాణాలు నిలబడలేదని, ఉదయం 7:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారని తెలిపాయి. కాగా, హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆసుపత్రికి చేరుకున్న తరువాతే, హరికృష్ణ మృతి వార్తను వైద్యులు ప్రకటించారు. అయితే నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌ కూడా 2014 జనవరిలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఆ ప్రమాదం కూడా నల్గొండ జిల్లా పరిధిలోనే జరిగింది.

- Advertisement -