ప్రధాని మోడీపై టీడీపీ ఎమ్మెల్యే,సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. బాలయ్య వాఖ్యలపై కమలనాథులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్‌లో బాలయ్యపై ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు బీజేపీ నేతలు. దేశ ప్రధానిపై ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని… ఆయనపై కేసు పెట్టేందుకు కూడా వెనుకాడబోమన్నారు. బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలకు వెనక్కు తీసుకొని… క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకు దిగగా బీజేపీకి పోటీగా టీడీపీ నేతలు సైతం ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
బాలకృష్ణ వ్యాఖ్యలపై మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా స్పందించారు. ప్రధానిపై బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమని… ఆయన గతంలో కూడా చాలా సార్లు ఇలాగే మాట్లాడారన్నారు. ప్రధానిని విమర్శిస్తున్నా… చంద్రబాబు వేదికపై ముసి, ముసి నవ్వులు నవ్వుతూ ప్రోత్సహించారని మండిపడ్డారు.