నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ‌్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. సాగర్‌లో బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి గురవయ్య యాదవ్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడుతుండగా…అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరికి టికెట్ ఇస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత జానారెడ్డి పేరు ఎప్పుడో ఖరారు అయింది. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా పార్టీ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభిస్తూ క్యాడర్‌లో ఉత్సాహం రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు. సొంత నియోజకవర్గమైన సాగర్‌పై జానారెడ్డికి మంచి పట్టు ఉంది. ఇప్పటికే ఏడుసార్లు గెలిచారు.
కాని 2018 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ వేవ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. నోముల మరణంతో మళ్లీ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే బలమైన టీఆర్ఎస్ అభ్యర్థిని ఎదుర్కొని జానారెడ్డి విజయం సాధించడం అంత ఈజీ కాదని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇక్కడ అధికార పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండడంతో పాటు, యాదవ సామాజికవర్గం నుంచి గురవయ్య యాదవ్ కాని, రంజిత్ యాదవ్‌ను కాని బరిలోకి దింపితే జానారెడ్డికి ఇబ్బందులు తప్పవు. మరోవైపు సొంత నియోజకవర్గంలో చెలరేగుతున్న అసమ్మతి జానారెడ్డికి ఇబ్బంది కరంగా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నాగార్జున సాగర్ రాజకీయాలను జానారెడ్డి కుటుంబం ఒంటి చేత్తో శాసిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉండే క్యాడర్‌తో పాటు గ్రామగ్రామానా జానారెడ్డికి ప్రత్యేకంగా ఓవర్గం ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా జానారెడ్డి అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే జానారెడ్డి కుటుంబ పాలనపై ద్వితీయ శ్రేణి నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జానారెడ్డి మర్రిచెట్టులా కాంగ్రెస్‌లో పాతుకుపోయారని, మర్రి చెట్టు నీడలో మొక్కలు ఎదగవన్నట్లుగా తాము కూడా రాజకీయంగా ఎదగలేమని భావిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీలో చేరుతున్నారు. ఇటీవల జానారెడ్డి ప్రధాన అనుచరుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ టికెట్ రేసులో ఇంద్రసేనారెడ్డి కూడా ఉండడం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తోంది. మరో ప్రధాన అనుచరుడు, గిరిజన నేత డాక్టర్ రవి నాయక్ కూడా ఇటీవల కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.
ఇప్పుడు ఈయన కూడా బీజేపీ టికెట్ రేసులో ఉండడం జానారెడ్డి కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించను అంటూనే తన ఇద్దరు కుమారులను రాజకీయ వారసులుగా నిలిపేందుకు జానారెడ్డి ప్రయత్నిస్తుండడంతో తాము ఎప్పటికీ లోకల్‌లీడర్లగానే ఉండిపోవాలా అంటూ కీలక కాంగ్రెస్ నేతలంతా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబపాలన నడుస్తుందని రిక్కల ఇంద్రసేనారెడ్డి, రవి నాయక్ చేస్తున్న విమర్శలు జానారెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించే అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇంద్రసేనారెడ్డికి రెడ్డి సామాజికవర్గంలో, రవినాయక్‌కు ఎస్టీ సామాజికవర్గంలో మంచి గుర్తింపు ఉంది. కేవలం పార్టీపై జానారెడ్డి కుమారుల పెత్తనం వల్లనే లోకల్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు టాక్. ఇక లోకల్ లీడర్లకు రేవంత్ రెడ్డి వర్గం తోడైంది. ఇటీవల పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి దాదాపుగా కన్ఫర్మ్ అయిందనే వార్తల నేపథ‌్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు.
సీనియర్ నేతలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న రేవంత్ రెడ్డి వర్గంపై జానారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ పరోక్షంగా విమ ర్శలు గుప్పించారు. పార్టీలో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని, అభిమానం ఉంటే ఇతర నాయకుల్ని విమర్శిస్తారా అంటూ జానారెడ్డి పరోక్షంగా రేవంత్ రెడ్డి అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని, ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తా అంటూ జానారెడ్డి చేసిన హెచ్చరికపై రేవంత్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జానారెడ్డిని ఓడిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని లోకల్ లీడర్లు భావిస్తున్నారని సమాచారం. వీరికి రేవంత్ రెడ్డి వర్గం కూడా తోడైందని తెలుస్తోంది. ఒకవేళ జానారెడ్డి సాగర్‌లో గెలిస్తే…పీసీసీ అధ్యక్ష పదవికి లేకపోతే ఏకంగా సీఎం సీటుకే ఎసరు పెడతారని, అందుకే ఆయన్ని ఓడించాలని రేవంత్ రెడ్డి వర్గం లోకల్ కాంగ్రెస్ లీడర్లతో చేతులు కలిపారని సమాచారం. ఈ నేపథ్యంలో సాగర్ ఉప ఎన్నికలలో జానారెడ్డి మరోసారి ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ నాయకులకే అంగీకరిస్తున్నారంట.. జానారెడ్డిపై అసమ్మతి చెలరేగుతున్న తరుణంలో సాగర్‌లో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.