అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న సుందర ప్రదేశాల్లో ఇటీవలే మొదలైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆయన పరవశించిపోయారు. ప్రేక్షకులతో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
“హాయ్.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత (హైదరాబాద్) వచ్చేస్తాను. లవ్ యు ఆల్. సీ యు.” అంటూ ఉత్సాహంగా చెప్పారు నాగార్జున.
బ్లాక్ డ్రస్, బ్లాక్ గాగుల్స్, బ్లాక్ గ్లౌజెస్ ధరించిన నాగ్.. మన్మథుడు అని ప్రేక్షకులు ఇచ్చిన బిరుదుకు తగ్గట్లుగా హ్యాండ్సమ్‌గా, ఎంతో ఫిట్‌గా, మరెంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు.సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు.నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు.
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచా
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్ డైరెక్టర్: డేవిడ్ ఇస్మలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
ఆర్ట్: మురళి ఎస్.వి.
స్టంట్ కో-ఆర్డినేటర్: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్