రివ్యూ:నాగభరణం

389
- Advertisement -

సురక్షా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన చిత్రం నాగభరణం. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన కోడి రామకృష్ణ…మరోసారి తనమార్క్ విజువల్ ఎఫెక్ట్స్‌తో నాగాభరణంతో ముందుకువచ్చాడు. మరి నాగభరణంతో ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం.

కథ :

సూర్యగ్రహణం రోజున దుష్టశక్తులేవి భూగోళాన్ని నాశనం చేయకుండా ఉండే శక్తికవచాన్ని శివయ్య(సాయికుమార్‌)వంశం కొన్ని సంవత్సరాలుగా కాపాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచాన్ని కాపాడే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయి, శక్తి కవచాన్ని కూడా జారవిడుస్తుంది. ఆ తర్వాతి జన్మలో శక్తి కవచాన్ని ఎలాగైనా అదే స్థానంలో ప్రతిష్టింపజేయడానికి నాగమ్మ, మానస (రమ్య)గా పుట్టి శక్తికవచం కోసం పోరాడుతుంది. అసలు శక్తికవచం మహత్యం ఏంటి? జారవిడిచిన శక్తికవచం ఎవరిచేతుల్లోకి వెళ్లింది..?శక్తికవచచం దక్కించుకోవడానికి దుష్టశక్తులు పన్నే పన్నాగం ఏంటీ..అన్నదే నాగాభరణం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కోడి రామకృష్ణ మార్క్‌ విజువల్ ఎఫెక్ట్స్‌. తనదైన మార్క్ విజువల్ ఎఫెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడే చెప్పాలి. క్లైమాక్స్ దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నం బాగుంది. సాయి కుమార్‌ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. రమ్య నటన బాగుంది.

nagabaranam

మైనస్ పాయింట్స్ :

శక్తి కవచం అంటూ దుష్టులంతా దాన్ని వెంటబడడం అనే అంశంపై ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంశంతో వచ్చి కొత్త విషయమేదీ చెప్పకపోగా చాలా చోట్ల బోర్ కొట్టించింది. బలమైన కథం లేకపోవడం, దానికి ఆకట్టుకునే కథనమైనా లేకపోవడం సినిమాకు మేజర్ మైనస్. విలన్ పాత్రలో అసలు బలం లేకపోగా, ఓవర్ యాక్టింగ్ వల్ల అది జోకర్ పాత్రలా తేలిపోయింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌దే బలమైన పాత్ర. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలన్నీ తలనొప్పి తెచ్చేలా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఏమాత్రం బాగోలేదు. దర్శక, రచయిత కోడి రామకృష్ణ విషయానికి వస్తే, ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేయాలన్న ఆలోచన, చిన్న పాయింట్ తప్పితే ఒక బలమైన కథంటూ లేకుండా సినిమాను తెరకెక్కించారు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమయ్యారు.ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

గ్రాఫిక్స్‌ సినిమాలు తీయడంలో కోడి రామకృష్ణది అందవేసిన చెయ్యి. విజువల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేస్తే ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి చూస్తారన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో బలమైన కథ, కథనం అనే కాన్సెప్ట్‌ను మిస్సై తెరకెక్కించారు. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ సినిమాల్లా కాకుండా నాగభరణం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

విడుదల తేదీ : 14/10/ 2016
రేటింగ్ : 2.25/5
నటీనటులు : రమ్య, దిగంత్
సంగీతం : గురు కిరణ్
నిర్మాత : సాజిత్ ఖురేషీ, సోహేల్ అన్సారి, ధవల్ గడ
దర్శకత్వం : కోడి రామకృష్ణ

- Advertisement -