గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పోరాట విషయాన్ని గమనిస్తున్నానని సీనీ నటుడు నాగబాబు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పోరాటం పక్కదారి పట్టిందన్నారు. సంబంధంలేని వారు ఈ అంశంలోకి వచ్చి పోరాటాన్ని పక్కదోవ పట్టించారని, ఆ అంశంపై స్పందించేందుకు వచ్చానని నాగబాబు తెలిపారు. తాను మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని మీడియా తన మాటలను వక్రీకరించొద్దని తెలియజేశారు.
కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ… ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్తేమి కాదని. ఈ విషయం అందరికి తెలుసని, ఒక్క సినీ రంగంలోనే ఈ విధానంలేదని ప్రతిరంగంలో ఉందని అన్నారు. ఒక్క సినీ రంగాన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. సినీరంగంలోనూ మనుషులే ఉంటారని దేవతలు, దేవుళ్లు ఉండరని పేర్కొన్నారు.సినీ పరిశ్రమలో కొంత మంది వెధవలు చేసే పనికి.. అందరినీ తప్పుబట్టడం సరికాదన్నారు. సినీ పరిశ్రమపై గౌరవం ఉంది కనుకనే నా కూతురిని ఈ రంగంలోకి ఆహ్వానించానని తెలియజేశారు. క్యాస్టింగ్ కౌచ్‌కి తాను వ్యతిరేకమని. ఈ రంగంలో ఎవరైనా వేధిస్తే అమ్మాయిలు చెప్పుతో కొట్టాలన్నారు.
మా అసోసియేషన్ సభ్యులందరికి న్యాయం చేయడం తమ బాధ్యతని, ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదని, తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదని ఆయన అన్నారు. మా సభ్యత్వం ఫీజు రూ. లక్ష ఉందని, మా సభ్యత్వం ఉచితంగా ఇవ్వడం కుదరదన్నారు. ఎందుకంటే మా అసోసియేషన్ అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని, సీనియర్ నటులకు ఫింఛన్ కూడా ఇస్తుందని పేర్కొన్నారు. ఎంతో మందిని ‘మా’ ఆడుకుంటుందని ఆయన తెలియజేశారు