‘లక్ష్య’ మూవీ రివ్యూ..

636
- Advertisement -

టాలీవుడ్‌లో మొదటిసారి ఆర్చరీ నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా వచ్చిన చిత్రం ‘లక్ష్య’. సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈరోజు లక్ష్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈమూవీ ఏ మేరకు మెప్పించిదో తెలుసుకుందాం..

కథ:

వాసు (రవిప్రకాశ్) ఆర్చరీ క్రీడాకారుడు. వరల్డ్ ఛాంపియన్ కావాలన్నదే అతడి లక్ష్యం. పోటీలకు వెళుతుండగా.. కార్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. వాసు తనయుడు పార్ధు (నాగశౌర్య)లో చిన్నతనం నుంచే ఆర్చరీలోని మెళకువలు ఒంటబడతాయి. అది తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్ ) గుర్తిస్తాడు. అతడ్ని ఎలాగైనా వరల్డ్ ఛాంపియన్‌ను చేసి కొడుకు కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఊరినుంచి సిటీకి మకాం మారుస్తాడు. ఆస్తులన్నిటినీ అమ్మి మనవణ్ణి సిటీలో పెద్ద కోచింగ్ అకాడమిలో చేర్పిస్తాడు. పార్థు కష్టపడి స్టేట్ ఛాంపియన్ అవుతాడు. ఆపై వరల్డ్ ఛాంపియన్ పోటీలకు రెడీ అవుతుండగా.. తాతయ్య రఘురామయ్య చనిపోతాడు. ఆ బాధతో ఆటలో గెలుపుకోసం డ్రగ్స్ అలవాటు చేసుకుంటాడు. దాంతో అకాడమి అతడ్ని సస్పెండ్ చేస్తుంది. అసలు పార్థు డ్రగ్స్ కు బానిసఅవడానికి కారణమేంటి? దానికి వెనుక ఎవరున్నారు? ఆత్మహత్య చేసుకోవాలనున్నప్పుడు అతడ్ని కాపాడిన సారథి (జగపతిబాబు)కి, అతడికి రిలేషన్ ఏంటి? అతడి జీవితంలోకి వచ్చిన రితిక (కేతికా శర్మ) పాత్ర ఏంటి? పార్థు చివరికి వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ఎలా గెలుచుకున్నాడు? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్‌:

పార్థుగా నాగశౌర్య పెర్ఫార్మెన్స్, మేకోవర్ ఆకట్టుకుంటాయి. హీరోయిన్ కేతికా శర్మ గ్లామర్ పరంగానూ, అభినయం పరంగానూ ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథలకు.. చక్కటి డ్రామా, ఎమోషన్సే ప్రధానాంశాలు. వాటితోనే ‘లక్ష్య’ సినిమాని నడిపించాలని చూశాడు దర్శకుడు సంతోష్.

మైనస్‌ పాయింట్స్‌:

బలమైన స్క్రీన్‌ ప్లే లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌ పాయింట్ అని చెప్పాలి. అలాగే కొన్ని సన్నివేశాల్ని ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తారు. అయితే క్లైమాక్స్ విషయంలో మరింతగా కసరత్తు చేసి ఉంటే బాగుండేది. వరల్డ్ ఛాంపియన్ పోటీల్లోని ఫైనల్స్ అనగానే ఆ సన్నివేశాలపై ప్రేక్షకుల్లో టెన్షన్, ఎమోషన్స్ బలంగా ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం:

సినిమాకి నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కాలభైరవ సంగీతం పర్వాలేదనిపిస్తుంది.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే.. ‘లక్ష్య’ సినిమా కొత్తదే అయినప్పటికీ.. కథాకథనాలు సాధారణంగానే అనిపిస్తాయి. స్పోర్ట్స్ మూవీస్‌పై ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

విడుదల తేదీ : డిసెంబర్ 10, 2021
రేటింగ్‌: 2/5
నటీనటులు : నాగశౌర్య, కేతికా శర్మ
సంగీతం: కాలభైరవ
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పున్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్
దర్శకత్వం : ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి

- Advertisement -