మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ వేదికపై టాక్‌షో హోస్ట్‌గా సందడి చేయబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్న ‘చిరంజీవి మెగావర్స్’ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి పేరులోని ‘N’ అక్షరం కనిపించకుండా చేయడం ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రోమోలో నగరంలోని పలువురు వ్యక్తులు చిరంజీవి పేరులో ‘N’ అక్షరం కనిపించకపోవడాన్ని గమనిస్తారు. కొబ్బరి బోండాల వ్యాపారి, ఆటో డ్రైవర్, డేటింగ్‌కు వెళ్లిన యువతి ఇలా పలువురు ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నగరంలోని హోర్డింగులు, ఆటోల వెనుక ఉండే పోస్టర్లు, టీ షర్టులు, వార్తాపత్రికలు, గోడలపై చిత్రాలు, అభిమానుల చేతులపై ఉన్న టాటూల్లోనూ చిరంజీవి పేరులో ‘N’ అక్షరం మాయమైనట్లు చూపించారు.
ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చిరంజీవి ఎంట్రీ ఇస్తారు. ఎరుపు రంగు లెదర్ కుర్చీలో స్టైలిష్‌గా కూర్చున్న ఆయన.. తన పేరులో ఖాళీగా ఉన్న స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోగోను పోలిన ‘N’ అక్షరాన్ని చూపిస్తారు. అనంతరం తెలుగులో ‘ఇది నా అడ్డా’ అంటూ డైలాగ్ చెబుతూ ప్రత్యేకమైన నవ్వుతో ఆకట్టుకుంటారు.
ఈ టాక్‌షోలో సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అయితే విడుదలైన ప్రోమోలో అతిథుల పేర్లను నెట్‌ఫ్లిక్స్ వెల్లడించలేదు. అయితే కమల్ హాసన్, నాగార్జున, రవితేజ, నాని, బ్రహ్మానందం, బాబీ, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో కనిపించే అవకాశం ఉంది.చిరంజీవి మెగావర్స్ ప్రీమియర్ తేదీని నవంబర్ 30న ప్రకటించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెల్లడించింది.
Also Read:Nvidia:జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

