‘యతి’ గురించి వింటే మతి పోతుంది.. ఉందా..? లేదా..?

474
Yeti
- Advertisement -

హిమాలయ పర్వత ప్రాంతాల్లో కోతి, మనిషిని పోలిన ఒక అతిభారీ ఆకారం తిరగటాన్ని చూశామంటూ దశాబ్దాలుగా కొందరు చెబుతూ వస్తున్నారు. ఇటీవల యతి పాదముద్రలు చూశామంటూ ఇండియన్ ఆర్మీ చేసిన పోస్టు మంచుమనిషి ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతివిగా భావిస్తున్న పాదముద్రలు గుర్తించినట్లు భారత సైన్యం సోమవారం ప్రకటించింది.

తొలిసారిగా, భారత ఆర్మీకి చెందిన ఓ పర్వతారోహణ బృందం ఏప్రిల్ 9న నేపాల్‌లోని మకలు బేస్ క్యాంప్ సమీపంలో అంతుచిక్కని పాదముద్రలను గుర్తించింది. పురాణాల్లో కనిపించే యతికి చెందినవిగా భావిస్తున్న ఈ పాదముద్రలు 32 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పు ఉన్నాయి. మకలు-బారున్ జాతీయ పార్కు వద్దే గతంలోనూ ఈ అంతుచిక్కని మంచు మనిషి జాడలు కన్పించాయి అని భారత ఆర్మీ ట్వీట్‌చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

Yeti

అయితే ఈ ఫొటోల్లో ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండడం గమనార్హం. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారిన ఈ విషయంపై అప్పుడే బోల్డన్ని కథనాలు కూడా వచ్చేశాయి. పురాణాల్లోనూ యతి ప్రస్తావన ఉందని, ఒక్కో దేశంలో యతిని ఒక్కో పేరుతో పిలుస్తారంటూ పురాణ, జానపదాల్లో వాటి ప్రస్తావన గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి.

యతి అనే వింతజీవి మానవుల కన్నా పెద్ద పరిమాణంలో, కోతి లేదా ఎలుగుబంటి ఆకారంలో ఉండి, ఒళ్లంతా వెంట్రుకలు ఉంటాయనీ, హిమాలయాలు, సైబీరియా, మధ్య, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ జీవి నివసిస్తుందని వందల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కథలు ఒక తరం నుంచి మరో తరానికి చేరుతున్నాయి తప్ప యతిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఇప్పటివరకు ఎవరూ లేరనే చెప్పాలి.

Yeti

ప్రస్తుతం యతి ఉనికి గురించి వస్తున్న వార్తలపై డెహ్రాడూన్‌‌లోని వైల్డ్‌లైప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త బివాష్ పాండవ్ స్పందించారు. హిమాలయాల్లో యతి వంటి జీవి ఉందన్న వార్తలను తాను నమ్మబోనన్నారు. ఆర్మీకి కనిపించిన పాముద్రలు బహుశా బ్రౌన్ బేర్‌వి అయి ఉండొచ్చన్నారు.

అలాగే నేపాల్‌లోని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్‌కు చెందిన సంతోష్ మణి మాట్లాడుతూ.. ఇక్కడి స్థానికులు బ్రౌన్ బేర్‌ను యతిగా వ్యవహరిస్తుంటారని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం వీరి వాదనను కొట్టిపడేస్తున్నారు. అవి యతి అడుగులేనని అంటున్నారు. నిజంగా వారు చెప్పినట్టు బ్రౌన్ బేర్ అడుగులే అయితే ఓ క్రమ పద్ధతిలో అవి ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటివరకు యతి ఉనికికి సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదు. అయినా ఇంకా చాలామంది వాటి కోసం హిమాలయాల్లో వెతుకుతూనే ఉన్నారు.

- Advertisement -