కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంచలన ప్రకటన చేశారు. 19 ఏళ్లుగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా.. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సోనియా రెండుసార్లు ఆపార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషిచేసింది. ఒకాన దశలో కాంగ్రెస్ పనైపోయిందిరా..అనుకుంటున్న సమయంలో సోనియా..తన అత్త ఇందిరాగాంధీలా మారిపోయారు. పార్టీ బాధ్యతలు తన భుజాన వేసుకుని దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తూ 2004లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా ప్రధానమంత్రి పదవిని స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ విదేశీ మహిళ ప్రధాని పదవి చేపట్టడానికి వీలు లేదని బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళన బాటపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా మన్మోహన్‌ను చేసిన సోనియా..తాను యూపీఏ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చినా మన్మోహన్‌నే ప్రధానిగా కొనసాగించి ప్రజల మన్ననలు పొందింది.
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాహుల్‌కు బాధ్యతలు అప్పగించడంతో పాటు అనారోగ్యం కూడా సోనియా రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఇవాళ పార్లమెంట్‌కు హాజరైన సోనియా మీడియాతో మాట్లాడారు.‘రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?’ అని ఓ విలేకరి సోనియాను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని ప్రకటించారు. సోనియా కీలక ప్రకటన చేయడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.