మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మకు బర్త్‌ డే విషెస్‌..

215
Mani Sharma
- Advertisement -

ఈ రోజు సంగీత దర్శకుడు మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ పుట్టిన రోజు. ఒక‌ప్పుడు అద్బుత‌మైన బాణీల‌తో శ్రోత‌ల‌ను ఎంత‌గా అల‌రించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య‌, వెంక‌టేష్ నార‌ప్ప‌, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. మణి శర్మ పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.

మణిశర్మ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు. ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయొలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత రికార్డింగుల్లో వయొలిన్ గిటార్ కన్నా కీబోర్డ్ వాయించే వాళ్ళకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు.

పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్ కు ఇంకా చాలామందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. తరువాత కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాడు.1982 లో 18 ఏళ్ళ వయసులో చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయాడు. సంగీత దర్శకుడు చెళ్ళపిళ్ళ సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర శిష్యరికం చేసారు. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటి రికార్డింగులకీ అప్పట్లో మద్రాసే కేంద్రం. కాబట్టే అన్ని భాషల సినిమాలకీ ఎందరో మహానుభావులైన సంగీతదర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. కీరవాణి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకీ పనిచేశాడు.

క్షణక్షణం సినిమాకి కీరవాణి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాంగోపాల్‌వర్మ అప్పుడప్పుడూ వచ్చి కూర్చుని ఆసక్తిగా గమనించేవాడు.అలా మణిశర్మకు మొట్టమొదటిసారి రీరికార్డింగ్‌ చేసే అవకాశాన్నిచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. అది రాత్‌ (తెలుగులో ‘రాత్రి’) ! అనే హర్రర్‌ సినిమా. తర్వాత అంతం సినిమాలో ఒక పాట చెయ్యమంటూ మళ్లీ రామూ దగ్గర్నుంచి పిలుపొచ్చింది. చలెక్కి ఉందనుకో, ఈ చలాకి రాచిలకో అనే పాట అది. ఆయన స్వరపరిచిన చేసిన మొట్టమొదటి పాట.

ఈ తరం సంగీత దర్శకుల్లోని దేవి శ్రీ ప్రసాద్ కు కీ-బోర్డ్ గురువీయన. ఏ.వి.యస్. తొలిసారి దర్శకత్వం వహించిన “సూపర్ హీరోస్” చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. సంగీత దర్శకుడుగా ఆయన కొచ్చిన తొలి అవకాశం చిరంజీవి సినిమానే అయినా విడుదలయింది మాత్రం సూపర్‌ హీరోస్‌. బావగారూ బాగున్నారా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది. జయంత్‌, గుణశేఖర్‌ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాలకు పనిచేసే అవకాశాలు వరసగా వచ్చాయి. దానికితోడు సమరసింహారెడ్డి, గణేష్‌, రావోయి చందమామ, చూడాలని ఉంది… ఇలా వెంటవెంటనే పెద్దహీరోల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం రావడం, అన్నీ మ్యూజికల్‌హిట్లు కావడంతో ఆయన దశ తిరిగింది.

ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్ బీట్ తో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన ప్రతీ సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది. ఈయన చేసిన మెలొడీలలో చాలా అత్యద్భుతమైన పాటలున్నాయి. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ ఇచ్చిన బిరుదది. పరిశ్రమలోని దాదాపు ప్రతీ నాయకుడికి సంగీతాన్ని అందించాడు. ఇతనిని అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. ఇతర చిత్రాలకు కూడా తన నేపథ్య సంగీతాన్ని అందించి వాటికి ప్రాణం పోశాడు. ఆయన తనయుడు మహతీ స్వరసాగర్ సైతం సంగీత దర్శకునిగా సాగుతున్నాడు. మణి బాణీల సత్తా తెలిసిన వారు ఆయన సంగీతం కోసం పరుగులు తీస్తున్నారు. నవతరంతో పోటీకి సై అంటూ సాగుతోన్న మణిశర్మ మరిన్ని చిత్రాలలో తనదైన బాణీలు పలికిస్తారని ఆశిద్దాం!

- Advertisement -