కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

161
- Advertisement -

మునుగోడులో ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియను ఈ నెల 6వ తేదీన మొదటి రౌండ్‌తో ప్రారంభమవుతుందన్నారు. అంతకు ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పోలైన 686 ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఈవీఎంల ద్వారా ఓట్లను లెక్కిస్తామన్నారు.

కౌంటింగ్‌ ఏజెంట్‌లు ఉదయం 7 లోపు కౌంటింగ్‌ సెంటర్ల వద్దకు రావాలని లేనియేడల లోపలికి అనుమతించబోమని అన్నారు. మొత్తం 15రౌండ్‌లో కౌంటింగ్‌ పూర్తి చేస్తామని అన్నారు. ఈ 15 రౌండ్లలో 298 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లన్నింటినీ లెక్కించనున్నట్లు తెలిపారు.

మొదటగా చౌటుప్పల్‌ మండలం ఓట్లను ఆ తర్వాత సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. ఇందులో ఒక్కో రౌండ్‌లో 21పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఇందుకోసం మొత్తం 21టేబుల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ఈ కౌంటింగ్ కోసం 300మంది సిబ్బందిని నియమించి వారికి కౌంటింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చామన్నారు. కౌంటింగ్‌ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకునేలా ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చిందన్నారు. కౌంటింగ్‌ హాలులోకి ఏజెంటు సెల్‌ఫోన్‌లు మరియు ఎలాంటి ఆధునిక ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకురావద్దని ఇప్పటికే దీనికి సంబంధించిన సూచనలను పార్టీలకు తెలియజేశామని అన్నారు.

ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా దాదాపుగా 800మంది పోలీసు భద్రత సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్‌సింగ్‌తో పాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

తొలి రౌండ్‌ కౌంటింగ్‌ ఉదయం 8గంటలకు ప్రారంభించి … 8.30లకు తొలి ఫలితం వెలువరిస్తామని అన్నారు. మొత్తం పూర్తిగా 15రౌండ్‌లో కౌంటింగ్‌ పూర్తి చేసి పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా వేయబడిన ఓట్లను కూడా కౌంటింగ్‌ పూర్తిచేస్తామని అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తిస్థాయిలో ఫలితం వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

1952నాటి తొలి ఓటరు నేగీ కన్నుమూత

మోడీ యాక్టింగ్ స్కూల్…నవ్వుఆపుకోలేరు!

భారతీయులు గొప్పోలు..ప్రశంసించిన పుతిన్‌

- Advertisement -