మునుగోడు బైపోల్‌..కారు గుర్తుపైనే పోటీ

79
- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన స్వార్ధ రాజకీయం కోసం తెచ్చిందే మునుగోడు ఉప ఎన్నిక. 2018లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా, కేవలం కాంట్రాక్టుల కోసమే కన్న తల్లి వంటి సొంత పార్టీని ధిక్కరించి బీజేపీలో చేరాడు. సాధారణ ఎన్నికలకు ఏడాది ఉండగానే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యాడు.

వ్యాపారాన్నే నమ్ముకుని రాజకీయం చేసే రాజగోపాల్‌ రెడ్డి ఏనాడు నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. గత కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మానసికంగా, ఆర్ధికంగా, అభివృద్ధిపరంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న కేంద్రానికి రాజగోపాల్‌ రెడ్డి ఎరగా చిక్కాడు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వ్యూహంలో భాగంగానే కోమటిరెడ్డికి 22వేల కోట్ల కాంట్రాక్టును ఇప్పిస్తామని, పార్టీ మారాలని చెప్పడంతోనే రాజగోపాల్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల టీఆర్ఎస్‌ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టారు.

కోమటిరెడ్డి మాత్రం తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలు తమ ప్రజలకు చేరలేదని సాకును బూచీగా చూపి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి ప్రజలు నమ్మడం లేదు. అయితే ఇటీవల ఓ సభకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు తనకు కాంట్రాక్టులో వచ్చిన డబ్బులో దాదాపు 5వేల కోట్లు రాజగోపాల్‌ రెడ్డికి అందనున్నట్లు సమాచారం. అయితే అందులో మునుగోడులో జరగనున్న ఉప ఎన్నిక కోసం 500 కోట్ల వరకు ఖర్చు చేస్తానని రాజగోపాల్‌ రెడ్డి హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు అభివృద్ధి జరగడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డికి నియోజకవర్గం ప్రజలు ఎక్కడికెళ్లినా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మునుగోడులో అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా అన్ని నియోజకవర్గాల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందో.. మునుగోడులో సైతం జరుగుతోంది. ఫించన్ల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నిపథకాల్లో మునుగోడు ప్రజలు లబ్ధిపొందారు. ఇదిలా ఉంటే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు పెడుతుందో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ప్రకటించి 24 గంటలు గడువకుండానే షెడ్యూల్‌ విడుదల కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే దేశమంతటా బీజేపీ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తోన్నాయి.

గతంలో ఏ ఉప ఎన్నిను సీరియస్‌ గా తీసుకోని టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికపై మాత్రం దృష్టి సారించింది. అయితే ఇటీవల భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న టీఆర్ఎస్‌ ఈ ఎన్నికపై ధీమాగా ఉంది. రానున్న సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌ గా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించాలని ఊవ్విళ్లూరుతోంది. మరోవైపు పేరు మార్పు ఎన్నికలకు అడ్డుకాబోదని, బీఆర్ఎస్‌కు ఈసీ గుర్తింపు వచ్చే వరకు టీఆర్‌ఎస్‌ పేరు కొనసాగనుండడంతో ఈ ఎన్నికలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ గుర్తుపైనే పోటీ చేయనుంది. మునుగోడులో ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది.

మునుగోడు గడ్డపై గులాబీ జెండాను ఎగరేయడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలకు బ్రహ్మరథం పడుతున్నారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిస్తామని టీఆర్ఎస్‌ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -