ఐపీఎల్-10: మూడోసారి విజేతగా రోహిత్‌ సేన

206
Mumbai Indians wins IPL 10
Mumbai Indians wins IPL 10
- Advertisement -

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠభరితమైన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ పై ‘ముంబై ఇండియన్స్’ విజయం సొంతం చేసుకుంది. ఐపీఎల్-10వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 130 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన పుణె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి.. కృనాల్‌ పాండ్య (47; 38 బంతుల్లో 3×4, 2×6) ఆదుకోవడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు సాధించింది. పుణె బౌలర్లు సమష్టిగా రాణించి ముంబయిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

పిచ్‌పై పెద్దగా అంచనా లేకపోవడంతో ముంబయి తొలి బంతి నుంచే వెనుకబడింది. మొదటి 2 ఓవర్లలో 7 పరుగులే చేసిన ఓపెనర్లు పార్థివ్‌ (4), సిమన్స్‌ (3)లను ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు ఉనద్కత్‌. మూడో ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన ముంబయిని అంబటి రాయుడు (12; 15 బంతుల్లో 1×4), కెప్టెన్‌ రోహిత్‌శర్మ (24; 22 బంతుల్లో 4×4) ఆదుకునే ప్రయత్నం చేశారు. స్మిత్‌ నేరుగా విసిరిన త్రోకు రాయుడు రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్న రోహిత్‌కు జంపా అడ్డుకట్ట వేశాడు. భారీషాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ డీప్‌ మిడ్‌వికెట్లో శార్దూల్‌ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు ఔటయ్యాడు. అదే ఓవర్లో పొలార్డ్‌ (7) కథ ముగిసింది. అంతే.. ముంబయి కష్టాలు రెట్టింపయ్యాయి. హార్దిక్‌ పాండ్య (10), కర్ణ్‌శర్మ (1) కూడా నిష్క్రమించడంతో ముంబయి 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మిచెల్‌ జాన్సన్‌ (13 నాటౌట్‌; 14 బంతుల్లో 1×6)తో కలిసి కృనాల్‌ పాండ్య ఇన్నింగ్స్‌ నిర్మించడంతో 17.4 ఓవర్లలో ముంబయి స్కోరు 100 పరుగులకు చేరుకుంది. వీరిద్దరు 8వ వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో ముంబయి గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

mum

130 పరుగుల లక్ష్యం కష్టంకాపోయినా… పిచ్‌పై బంతి మందగమనం నేపథ్యంలో కొంచెం అనుమానంతో పుణె.. కొంచెం ఆశతో ముంబయి కనిపించాయి. పుణె మెల్లగా ఆడే ప్రయత్నం చేసినా మూడో ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠి (3) వికెట్‌ను కోల్పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో కృనాల్ జారవిడచడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వన్‌డౌన్‌లో స్మిత్ (51) సమయోచితంగా స్పందించడంతో ఆ తర్వాత రహానే ఒత్తిడి లేకుండా ఆడాడు. రోహిత్ వరుసగా బౌలర్లను మార్చడం, భారీ షాట్లు లేకపోవడంతో పవర్‌ప్లేలో పుణె వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.

ఏడో ఓవర్ నుంచి ముంబై బౌలింగ్ మరింత పదునెక్కింది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు ఎండ్‌ల నుంచి కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పుణె జోడీ ఒత్తిడిలో పడింది. ఫలితంగా స్మిత్, రహానే వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమివ్వడంతో రన్‌రేట్ మందగించింది. నాలుగు ఓవర్లలో 20 పరుగులే రావడంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి పుణె స్కోరు 58/1కి చేరింది. చేయాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో రహానే కాస్త బ్యాట్ ఝుళిపించేందుకు యత్నించాడు. కానీ 12వ ఓవర్‌లో జాన్సన్ వేసిన స్లో బంతిని డ్రైవ్ చేయగా లాంగాన్‌లో పొలార్డ్ 15 అడుగులు ముందుకొచ్చి అద్భుతంగా అందుకున్నాడు.

smith

ప్రేక్షకులు కేరింతల నడుమ క్రీజ్‌లోకి వచ్చిన జార్ఖండ్ డైనమెట్ ధోనీ (10) కూడా ఒకటి, రెండు పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్‌లో కాస్త ఉత్కంఠ నెలకొంది. స్మిత్, మహీ 10 నుంచి 15 ఓవర్ల మధ్య 25 పరుగులే చేయడంతో 15 ఓవర్లలో పుణె 2 వికెట్లకు 83 పరుగులకు చేరింది. తర్వాతి ఓవర్‌లో ధోనీ వికెట్ తీసి బుమ్రా షాకిచ్చాడు. ఇక గెలువాలంటే 18 బంతు ల్లో 30 పరుగులు చేయాల్సి దశలో రెండు ఓవర్లలో 19 పరుగులే రావడంతో ఉత్కంఠ నెలకొంది. 6 బంతుల్లో 11 పరుగులు అవసరమైన దశలో జాన్సన్ వేసిన తొలి బంతిని బౌండరీ దాటించిన మనోజ్ తివారీ (7) రెండో బంతికి వెనుదిరిగాడు. మూడో బంతికి స్మిత్ అనూహ్యంగా క్యాచ్ ఔట్‌కావడంతో విజయసమీకరణం 3 బంతుల్లో 7గా మారింది. ఈ దశలో 3 పరుగులు వచ్చినా ఆఖరి బంతికి మూడో పరుగు తీసే ప్రయత్నంలో క్రిస్టియాన్ (4) రనౌట్‌కావడంతో ఒక్క పరుగు తేడాతో పుణె చతికిలపడింది.

అవార్డులు.. రివార్డులు

విజేత ( ముంబై ): రూ.15 కోట్లు
రన్నరప్( పుణె ): రూ.10 కోట్లు
ఫెయిర్‌ప్లే అవార్డు: గుజరాత్ లయన్స్
ఉత్తమ వర్ధమాన ఆటగాడు: బాసిల్ తంపీ(గుజరాత్)
అత్యంత విలువైన ఆటగాడు: బెన్ స్టోక్స్(పుణె)

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: కృనాల్‌ పాండ్య (ముంబయి ఇండియన్స్‌)

ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్) 641 పరుగులు

పర్పుల్ క్యాప్:భువనేశ్వర్(సన్‌రైజర్స్) 26 వికెట్లు

- Advertisement -