రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై గెలుపు..

38
Mumbai Indians

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ఈరోజు ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. 172 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే ఛేదించింది ముంబై. ఓపెనర్ క్వింటన్ డికాక్ 70 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. కృనాల్ పాండ్య 39 పరుగులు చేశాడు. పొలార్డ్ 16, సూర్యకుమార్ యాదవ్ 16, రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు 2, ముస్తాఫిజూర్ రెహ్మాన్ కు 1 వికెట్ లభించింది.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (41; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు), యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (32; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ సంజు శాంసన్ (42; 27 బంతుల్లో 5 ఫోర్లు), హిట్టర్ శివమ్ దూబే (35; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు. ముఖ్యంగా బుమ్రా సూపర్ ఎకానమీ స్పెల్ తో అదరగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరుకుంది.