ఐపీఎల్ 2020లో భాగంగా నాలుగో విజయాన్ని నమోదుచేసింది ముంబై ఇండియన్స్. రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. 18.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ముంబై బౌలర్ల ధాటికి రాజస్థాన్ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ జైశ్వాల్(0), స్టీవ్ స్మిత్(6) , సంజూ శాంసన్(0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు.
ఈ క్రమంలో ఓపెనర్ బట్లర్ విశ్వరూపం చూపించాడు. తన బ్యాట్‌కు పనిచెప్పిన బట్లర్ ఓ దశలో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్‌లు,ఫోర్లతో విరుచుకపడ్డాడు. బంతుల్లో 5 సిక్స్‌లు, ఫోర్లతో 70 పరుగులు చేసి పాటిన్సన్ బౌలింగ్‌లో పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. తర్వాత టామ్ కుర్రాన్ 15,రాహుల్ తెవాటియా5,శ్రేయాస్ గోపాల్ 1,ఆర్చర్ 24 పరుగులు చేసి వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో బుమ్రా 4,బోల్ట్ 2,పాటిన్సన్ 2,చాహర్,పొలార్డ్ ఒక వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్: 47 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు),రోహిత్ శర్మ(35: 23 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), హార్దిక్ పాండ్య(30 నాటౌట్: 19బంతుల్లో 2ఫోర్లు, సిక్స్) రాణించారు. రాజస్థాన్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్(4/28) తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.