చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం…

175
ishan kishan
- Advertisement -

ఐపీఎల్ 2020లో చెన్నై పరాజయాల పరంపర కొనసాగుతోంది. షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆ జట్టు విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ 12.2 ఓవర్లలో వికెట్ కొల్పోకుండా 116 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌కు చేరుకుంది ముంబై.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా ఓపెనర్‌ ఇషాన్ కిషాన్ దాటిగా ఆడగా అతడికి చక్కటి సహకారం అందించాడు డికాక్. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా ఫోర్లు,సిక్సర్లతో విరుచుకపడ్డాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేయగా డికాక్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేయడంతో ముంబై ఘన విజయం సాధించింది.

అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాప్ ఆర్డర్‌ ఘోరంగా విఫలమవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 114 పరుగులు చేసింది. యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌(52: 47 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) ఒక్కేడే హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. రుతురాజ్‌ గైక్వాడ్(0), డుప్లెసిస్‌(1), అంబటి రాయుడు(2), జగదీశన్‌(0), మహేంద్ర సింగ్‌ ధోనీ(16), జడేజా(7), దీపక్‌ చాహర్‌(0) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ముంబై బౌలర్లు ముఖ్యంగా ట్రెంట్‌ బౌల్ట్‌(4/18) అద్భుత పర్ఫామెన్స్ ఇవ్వగా బుమ్రా(2/25), రాహుల్‌ చాహర్‌(2/22) విజృంభణతో ధోని సేన పూర్తిగా విఫలమమైంది.

- Advertisement -