ఆన్‌లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ మరియు ఆన్‌లైన్ క్యాసినోల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ దానికి సంబంధించి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను ముంబై పోలీసులు చేధించారు. కేవలం ఒకటి లేదా రెండు నెలల వ్యవధిలోనే నిందితులు అందించిన 17 బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 125 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 110 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. వీటిలో 17 ఖాతాలకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన 38 సైబర్ నేరాల ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నమోదైన కేసులతో ఈ ఖాతాలకు లింకులు ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది.
డోంగ్రీ పోలీస్ స్టేషన్ సైబర్ సెల్ చేపట్టిన ఈ కీలక ఆపరేషన్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖిల్ కమల్‌కుమార్ జైస్వామి (26), రాహుల్ శ్యామ్‌లాల్ పరస్వామి (32), జై బిహారీ లాల్ తిర్యాణి (26) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఐదుగురు అనుమానితులను గుర్తించామని, వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని అధికారులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం… నిందితులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని, వారికి కొద్దిపాటి డబ్బులు ఎరగా చూపి వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించేవారు. ఖాతాలు తెరిచిన తర్వాత వారి పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు మరియు సిమ్ కార్డ్‌లను నిందితులు తమ ఆధీనంలోకి తీసుకునేవారు. ఆ తర్వాత సైబర్ మోసాల ద్వారా వచ్చే అక్రమ సొమ్మును ఈ ఖాతాల ద్వారా ఇతర ఖాతాలకు మళ్లించేవారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు నిందితుల వద్ద నుంచి 70 డెబిట్ కార్డులు, 42 పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:అనీష్..‘ఇట్లు అర్జున’

