మన ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా ఇంట్లో తోడుపెట్టే పెరుగులో మార్పులు గమనిస్తుంటాం. చాలామందికి వర్షాకాలంలో తోడుపెట్టిన పెరుగు గడ్డలా గట్టిగా కాకుండా జిగురుగా మారిపోవడం ఎదురవుతుంది.అయితే వర్షాకాలంలో పెరుగు జిగురుగా మారడానికి కారణాలు మరియు దానిని అరికట్టే 3 ముఖ్యమైన చిట్కాల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
వర్షాకాలంలో వాతావరణంలో తేమ మరియు వేడి కలసి బ్యాక్టీరియా పెరుగుదలకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. పెరుగు తయారీకి దోహదపడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాతో పాటు వాతావరణంలో ఉండే ఇతర హానికరమైన బ్యాక్టీరియాలు లేదా ఈస్ట్ వేగంగా వృద్ధి చెందుతాయి.గాలిలోని ఎక్కువ తేమ కారణంగా తోడు పెట్టిన పాలు సరిగ్గా గడ్డకట్టక, ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని పెరుగు జిగురుగా లేదా సాగుతున్నట్లు మారుతుంది.
జిగురు పెరుగును అరికట్టే సులువైన చిట్కాలను పరిశీలిస్తే.. వేసవి లేదా సాధారణ రోజుల్లో వేసే తోడు పరిమాణంతో పోలిస్తే వర్షాకాలంలో తోడు (పెరుగు లేదా మజ్జిగ) పరిమాణాన్ని సగానికి తగ్గించాలి. పాలు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకుండా కేవలం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ పరిమాణంలో తోడు వేయాలి.
పాలను తోడుపెట్టే ముందు కాస్త ఎక్కువ సేపు మరిగించడం వల్ల అందులోని నీటి శాతం తగ్గి, పాలు చిక్కబడతాయి.పెరుగు తోడుపెట్టే పాత్ర (గిన్నె) పూర్తిగా పొడిగా ఉండాలి. అందులో ఎలాంటి నీటి బొట్లు లేదా తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.వర్షాకాలంలో పెరుగు తోడుకోవడానికి సాధారణ రోజుల కంటే కాస్త ఎక్కువ లేదా తక్కువ సమయం పట్టవచ్చు. పెరుగు సరిగ్గా తోడుకున్న వెంటనే (గడ్డకట్టిన వెంటనే) దానిని బయటే వదిలేయకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి.
Also Read:అనీష్..‘ఇట్లు అర్జున’
ఫ్రిజ్‌లోని చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా మితిమీరి పెరగకుండా అడ్డుకుని, పెరుగు జిగురుగా మారకుండా గట్టిగా ఉండేలా చేస్తుంది.వర్షాకాలంలో మట్టి పాత్రలు (కండీ) లేదా గాజు పాత్రలలో పెరుగు తోడుపెట్టడం వల్ల కూడా తేమ సమతుల్యమై పెరుగు రుచిగా, గట్టిగా తోడుకుంటుంది.

