సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సోదరుడు, ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణ యాదవ్‌తో విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఆమెను ‘స్వార్థపరురాలు’గా అభివర్ణిస్తూ, తన కుటుంబాన్ని నాశనం చేసిందని ఆరోపణలు చేశారు. ఈ ప్రకటనను ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ద్వారా వెల్లడించగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆమె నా కుటుంబ బంధాలను నాశనం చేసింది. ఆమెకు కావలసింది పేరు, ప్రభావమే. ప్రస్తుతం నేను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాను, అయినా ఆమెకు ఎలాంటి పట్టింపు లేదు. ఆమెకు తన గురించి మాత్రమే ఆలోచన. ఇంత చెడ్డ మనసు ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆమెను పెళ్లి చేసుకున్నందుకు నేను దురదృష్టవంతుడిని అని ప్రతీక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రతీక్, అపర్ణ యాదవ్‌లు 2011లో నిశ్చితార్థం చేసుకుని, 2012లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అనిల్ అంబానీ వంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ప్రతీక్, అపర్ణ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ విషయంలో ఇప్పటివరకు అపర్ణ యాదవ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
అపర్ణ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె ఎస్పీని విడిచి బీజేపీలో చేరారు. 2017లో లక్నో కాంట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణా జోషికి ఓడిపోయారు. 2022లో టికెట్ ఆశించినప్పటికీ, ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. దీర్ఘ నిరీక్షణ తర్వాత, 2024 సెప్టెంబర్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించారు.
Also Read:బండ్ల గణేష్..అందరివాడు!

