యాదవ్ పరివార్‌లో అంతర్గత కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకున్నాయి. యూపీలో ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ములాయం,సీఎం అఖిలేష్‌ల మధ్య పోరు మరింత ముదిరి పాకాన పడింది. ములాయం, అఖిలేష్ వర్గీయులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. తాజాగా అఖిలేష్ మద్దతుదారుడు, ఎమ్మెల్సీ అయిన ఉదయ్ వీర్ సింగ్ ములాయంకు ఘాటైన లేఖ రాశారు. ఇందులో ఏకంగా అఖిలేష్ పై చేతబడి చేశారంటూ ఆరోపించటం రెండు వర్గాల మధ్య ఆందోళన రేపింది.
ములాయం రెండో భార్య సాధన గుప్తా యాదవ్ పై ఉదయ్ వీర్ సింగ్ ఈ ఆరోపణలు చేశారు. ములాయం తన కుమారున్ని కాదని… సోదరునికి మద్దతు ఇచ్చేందుకు సాధన గుప్తా కుట్ర చేశారన్నారు. ఏకంగా అఖిలేష్ యాదవ్ కు చేతబడి చేయించారని ఆరోపించారు. శివపాల్ యాదవ్ తో కలిసి సాధన గుప్తా కొత్త పార్టీ ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. కుటుంబీకుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైతం లేఖలో ఆయన సూచించారు.ముఖ్యమంత్రి పదవికి అఖిలేశ్ పేరును ములాయం సింగ్ ప్రతిపాదించినప్పటి నుంచి అఖిలేశ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఉదయ్ వీర్ తన లేఖలో వివరించారు.
ఈ వివాదం పై ములాయం వర్గం నేతలు కూడా ఫైరయ్యారు. నేతాజీని అవమాన పరిచే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదన్నారు. ఐతే, ములాయం గానీ అఖిలేష్ గానీ ఈ ఆరోపణలపై స్పందించ లేదు.
ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య ముల్లీ యాదవ్ (సీఎం అఖిలేష్ తల్లి) 2003లో మరణించారు. పార్టీ కార్యకర్తగా పని చేస్తున్న సాధనా గుప్తాతో ములాయం సింగ్ యాదవ్ కు పరిచయం అయ్యింది. ఇద్దరు చనువుగా దగ్గరయ్యారు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. 1988లో ములాయం, సాధనకు ప్రతీక్ యాదవ్ అనే కుమారుడు జన్మించాడు.
యూపీలో ఇప్పుడు ప్రతీక్ యాదవ్ పెద్ద బిల్డర్. రెండో పెళ్లి విషయాన్ని వీరు రహస్యంగా దాచిపెట్టారు. అయితే ప్రత్యర్థి పార్టీలు ములాయం సింగ్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని రెండో పెళ్లి విషయంలో విమర్శలకు దిగాయి. విసిగిపోయిన ములాయం 2007లో సాధన గుప్తా యాదవ్ తన రెండో భార్య అని అధికారికంగా దృవీకరించారు. అప్పటి నుంచి సాధన గుప్తా పార్టీలో నెంబర్ వన్ లేడీగా చలామణి అవుతున్నారు. అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం సింగ్ కు మద్దతుగా నిలిచారు. అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా సాధనా గుప్తా పావులు కదుపుతున్నారని విమర్శలు ఎక్కువ అయ్యాయి.