వన్డే ప్రపంచకప్ 2027లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాలా వద్దా అన్న అంశంపై గత కొంతకాలంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అత్యంత విజయవంతమైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరికి ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ, రోహిత్–కోహ్లీ ప్రపంచకప్ ఆడాలా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చారు. ధోనీ స్పష్టంగా ఒక విషయం చెప్పారు—వయసు కాదు, ఫిట్‌నెస్ మరియు ప్రదర్శనే ఆటగాళ్ల ఎంపికకు ప్రమాణాలు. రోహిత్ లేదా కోహ్లీ ప్రపంచకప్ ఆడాలా వద్దా అని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం కోసం ఆడాలనే ఆకలి, ప్రదర్శనపై నిబద్ధత ఉంటే వారు తప్పకుండా ఆడాలని చెప్పారు.
ఎందుకు ఆడకూడదు? వయసు నా దృష్టిలో ప్రమాణం కాదు. ప్రదర్శన, ఫిట్‌నెస్ మాత్రమే అసలు ప్రమాణాలు. ఎవ్వరూ రోహిత్ లేదా కోహ్లీకి ఏం చేయాలన్నది చెప్పాల్సిన అవసరం లేదు. అందరినీ సమానంగా చూడాలి. నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను. అప్పుడెవ్వరూ నా వయసు గురించి చెప్పలేదు. నేను ఏడాది, పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ఆడినా వయసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read:న్యాయవాదిగా మారిన సీఎం మమతా
వయసు అంశమా? కాదు. ఫిట్‌నెస్ ముఖ్యం. రోహిత్ కావచ్చు, కోహ్లీ కావచ్చు—వారు 30లలో ఉన్నారనే కారణంతో ప్రపంచకప్ ఆడాలా వద్దా అనేది మనం నిర్ణయించలేం. అది వారి నిర్ణయం. వారు ప్రదర్శన కొనసాగిస్తే, దేశం కోసం ఆడాలనే తపన ఉంటే ఎందుకు ఆడకూడదు? అనుభవం ఉన్న 20 ఏళ్ల ఆటగాడు దొరకడు—సచిన్ టెండూల్కర్ లాంటి వారు మినహా అని ధోనీ అన్నారు.

