ఆతిథ్య శ్రీలంకను టెస్టు, వన్డే సిరీస్ లలో వైట్ వాష్ చేసిన టీమిండియా మరోసారి తన సూపర్ ఫామ్ కొనసాగించింది. భువనేశ్వర్, కోహ్లీల అద్భుతమైన ప్రదర్శనతో ఆదివారం చివరిదైన ఐదో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భువనేశ్వర్ కుమార్ (5/42) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది.
239 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆరంభంలోనే రహానే, రోహిత్ వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి (110 నాటౌట్;కి కేదార్ జాదవ్ (63) మనీష్ పాండే (36) లు తోడవడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్ ను గెలిచి శ్రీలంకను శ్రీలంకలో 5-0తో వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా భారత్ ఘనత సాధించింది. తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించిన భువనేశ్వర్‌కు ‘మ్యాన్ ఆఫ్ దమ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టిన బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్నాడు. అనంతరం బూమ్రాకు బహుమతిగా వచ్చిన కారులో కోహ్లీ సేన షికారు చేసింది. ఏకైక టీ20 బుధవారం జరుగుతుంది.
నాలుగో వన్డేతో 300 వన్డేలు ఆడిన క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డ్ సృష్టించాడు. వన్డే క్రికెట్లో 100 స్టంపింగులు చేసిన తొలి వికెట్‌కీపర్‌గా రికార్డు సృష్టించాడు దోనీ. చాహల్ బౌలింగ్‌లో అఖిల ధనంజయను ఔట్ చేయడం ద్వారా స్టంపింగుల శతకం పూర్తి చేశాడు. సంగక్కర (99)ను అధిగమించి అత్యధిక వన్డే స్టంపింగుల చేసిన వికెట్‌కీపర్‌గా ధోని నిలిచాడు. అత్యధిక వన్డే స్టంపింగులు చేసిన వికెట్‌కీపర్ల జాబితాలో కలువితరణ (75) మూడో స్థానంలో, మొయిన్ ఖాన్ (73) నాలుగో స్థానంలో ఉన్నారు. ధోని రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ధోనీకి దగ్గరగా ఉన్న ముష్ఫికర్ (బంగ్లాదేశ్) 40 స్టంపింగులు మాత్రమే చేశాడు.
https://youtu.be/n9IHfq2G5Fw