లంక పర్యటనలో ఉన్న టీమిండియా వరుసగా నాలుగో వన్డేలోనూ అదే జోరును కొనసాగించింది. విరాట్, రోహిత్ చెలరేగడంతో భారత్ 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు చేయగా.. లంక 42.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది.
కెరీర్‌లో 29వ వన్డే సెంచరీ కొట్టిన కోహ్లీ.. 38 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. ఆ తరువాత సరిగ్గా 38 బంతులు ఆడి సెంచరీ మైలురాయి అందుకున్నాడు. విరాట్ ఔటైన తర్వాత ధాటిని కొనసాగించిన రోహిత్ 85 బంతుల్లో కెరీర్‌లో 13వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న ధోని (49 నాటౌట్; 42 బంతుల్లో 5×4, 1×6) వరుసగా మూడోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మనీష్ పాండే (50 నాటౌట్)తో కలిసి వేగంగా ఆడి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 101 పరుగులు జత చేసింది.
ధోని 300 వన్డేలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గురువారం భారత జట్టు సభ్యులు అతడిని సత్కరించారు. ఈ సందర్భంగా కోహ్లి జట్టు తరఫున ధోనికి ప్లాటినం(వెండి) బ్యాట్ బహుకరించాడు. మహేంద్రసింగ్ ధోని ఎప్పటికీ తమ కెప్టెనే అని విరాట్ కోహ్లి అన్నాడు. ‘‘ఏం మాట్లాడతాను. మాలో 90 శాతం మంది నీ సారథ్యంలోనే కెరీర్ ఆరంభించాం. నీకు ఈ జ్ఞాపిక ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నువ్వు ఎప్పుడూ మా కెప్టెన్‌గానే ఉంటావు’’ అని విరాట్ కోహ్లీ అన్నాడు. వన్డే క్రికెట్లో సచిన్ తెందుల్కర్ (463), రాహుల్ ద్రవిడ్ (344), అజహరుద్దీన్ (334), సౌరభ్ గంగూలీ (311), యువరాజ్ సింగ్ (304) తర్వాత మూడొందల మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు ధోనీ.