శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ఎంపీడీవో ల సంఘం నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన తెలంగాణ మండల పరిషత్ అభివృద్ది అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం సత్తయ్య, కార్యదర్శి ప్రశాంతి, కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, శేఖర్, శంకర్ నాయక్, వెంకటపతిరాజు, క్రాంతి, ఉమాదేవి, రమేష్ తదితరులను మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో, పల్లెల పరిశుభ్రత విషయంలో ఎంపీడీఓల పాత్ర మరువలేనిదని అన్నారు. అతి త్వరలో ఇంకా కొంత మంది పర్యవేక్షణ అధికారులు వస్తారని తద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని తెలిపారు.
కాగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీడీవోలు విన్నవించారు. అదేవిధంగా ఎంపీడీవో లకు సంబంధించి ప్రమోషన్ల అవకాశాలు మరింత పెంచవలసిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కెసీఆరHతో మాట్లాడి ఈ విషయం చర్చిస్తామని మంత్రి అన్నారు. ఎంపీడీఓలు క్షేత్ర స్థాయిలో బాగా పని చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింప చేయాలన్నారు.