సీఎం కేసీఆర్ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పొలిన సింబల్‌ని ఇండిపెండెంట్లకు కేటాయించడంతో తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని ఈసీ సునీల్ అరోరాకు ఫిర్యాదుచేయగా ఎన్నికల సంఘం స్పందించింది.
కారు గుర్తు (బోల్డ్)రంగు కనిపించేలా మార్పు చేయడంపై టీఆర్ఎస్ పార్టీని సూచనలు కోరింది. మార్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ సింబల్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు ఎంపీ వినోద్.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కారు గుర్తును పోలిన గుర్తులపై కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎం కేసీఆర్ ఫిర్యాదుచేశారని చెప్పిన వినోద్ సమాజ్ వాది ఫార్వర్డ్ క్లాస్ పార్టీ ట్రక్కు గుర్తు కారు గుర్తును పోలి ఉండడం వల్ల చాలా నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్‌లో కారు రంగు సరిగా కనిపించక పోవడం వల్ల వృద్దులు, కంటి సమస్య ఉన్న వారు ఇబ్బందులు పడ్డారని ఎంపీ వినోద్ ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ ప్రజలు కారు గుర్తుకు ఓటేసీ టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీని అందించారన్నారు.