లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్..

103
mp santosh

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జులై 24, 2019లో తను దత్తత తీసుకున్న కీసర రిజర్వు ఫారెస్ట్‌లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈరోజు నూర్ మహమ్మద్ కుంట దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదటి మొక్కను మంత్రి మల్లా రెడ్డితో కలిసి నాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కీసర రిజర్వు ఫారెస్ట్‌లో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇప్పటికే మూడు కోట్ల పైచిలుకు రూపాయలతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని.. రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న అడవిలో హైద్రాబాద్‌కు అతి చేరువలో ఉన్న దీనిలో ప్రజలు వచ్చి సేద తీరడం కోసం ఎన్నో రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. పర్యాటక శాఖ సహకారంతో పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల వినోద కార్యక్రమాల కోసం అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కీసరగుట్ట అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగిందని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అడవి పునరుద్ధరనలో భాగంగా పెద్దమొత్తంలో మొక్కలు నాటడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, అటవీశాఖ పిసిఎఫ్ శోభ, పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.